- నాలాల నెట్‌వర్కుపైనా నిపుణుల అభిప్రాయాల సేకరణ
కాలుష్యం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం.. ఇలా కారణాలేమైనా అసాధారణమైన వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం వరదముప్పు తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా మేధోమధనం చేసింది. “మూసీనది సరిహద్దు గుర్తింపు, ఓఆర్ఆర్ లోపల నాలా నెట్‌వర్క్సుతో పాటు వెడల్పుల నిర్ధారణ” అనే అంశంపై శుక్రవారం హైడ్రా సదస్సును నిర్వహించింది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం హైడ్రాకు లేనప్పటికీ మూసీ ఆక్రమణలపై హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. అస్సలు ఆ నది సరిహద్దుల నిర్ధారణ ఎలా చేపట్టాలనే విషయమై చర్చించింది. చెరువుల ఎఫ్‌టీఎల్‌ను గుర్తించిన విధంగానే మూసీ నది ఎంఎఫ్ ఎల్( మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్)ను గుర్తించేందుకు గ్రామ, రెవెన్యూ రికార్డులను దృష్టిలో పెట్టుకుని సరిహద్దులు నిర్ధారించాలని కొంతమంది సూచించారు.
మూసీ పరివాహక ప్రాంతం హైడ్రాలజీ నివేధికలు, ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలు, సర్వే ఆఫ్ ఇండియా రికార్దులను కూడా పరిశీలించి.. మూసీ హద్దులను నిర్ధారించి నిర్మాణాలు జరగకుండా చూడాలని పలువురు హైడ్రాకు సూచించారు. నగరంలో 1908, 1954, 2000, 2008 సంవత్సరాలలో కురిసిన భారీ వర్షాలు.. అప్పటి పరిణామాలను చర్చించి మూసీ నదీ పరీవాహకంలో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.
నాలాల్లో ఆటంకాలు లేకుండా..
నగరంలో నాలాలు కుంచించుకుపోకుండా చూడాలని పలువురు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 940 ప్రాంతాల్లో కల్వర్టులున్నాయని.. అక్కడ చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు సాధారణంగా వెళ్లడంలేదని పేర్కొన్నారు. పలు చోట్ల నాలాల లింకు కట్ అయ్యందని.. దానిని పునరుద్ధరించాలన్నారు.
కొన్ని చోట్ల కుంచించుకుపోయాయని.. అక్కడ నిర్మాణాలకు ఎలాంటి ముప్పు లేకుండానే కుదిరితే విస్తరణ లేదంటే మల్లింపు చేయాలని పలువురు సూచించారు. నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినప్పడు రహదారుల వెడల్పు విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నామో నాలాల నిర్మాణంలో కూడా అదే పాటించాలని పలువురు పేర్కొన్నారు.
నాలాల తీరుతెన్నులపై సమగ్ర సర్వే చేసి సరైన ప్రణాళికలు సూచించాలని పలువురు పేర్కొన్నారు. రెవెన్యూ, సర్వేఆఫ్ ఇండియా, ఇరిగేషన్, హైడ్రాలజీ, ఎస్ ఎన్‌డీపీ, ఎన్ ఆర్ ఎస్‌సీ, జీహెచ్ ఎంసీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పరేషన్‌తో పాటు.. అర్బన్ డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం అవుతున్న పలు సంస్థలకు చెందిన నిపుణులు ఇందులో పాల్గన్నారు.