మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
- టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
- సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాలలో ఐజల్ వాటర్ స్టేషన్ ప్రారంభం
- ఐమాక్స్ లైట్లు, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాల్లో టీజీఐఐసీ చైర్ పర్సన్, సర్పంచ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : చేర్యాల గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చేర్యాలలో సర్పంచ్ రేఖ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐజల్ వాటర్ స్టేషన్, ఐమాక్స్ లైట్ల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాలను నిర్మలరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చేర్యాల గ్రామంలో సుమారు రూ.25 లక్షల వ్యయంతో 20 కొత్త ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అలాగే ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) సహకారంతో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం గతంలోనే సుమారు రూ.3 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యాలు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ రామచందర్ నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
