Asian Cinemas | అధక్ష పదకికి సునీల్ నారంగ్ రాజీనామా
Asian Cinemas | అధక్ష పదకికి సునీల్ నారంగ్ రాజీనామా
థియేటర్ షేరింగ్ పై తీవ్ర ఒత్తిళ్లు
తట్టుకోలేక పదవిని వదిలివేస్తున్నానని ప్రకటన
Asian Cinemas | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ‘ఏషియన్ సినిమాస్’ అధినేత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక రాజీనామా లేఖను చాంబర్ ప్రతినిధులకు పంపారు. ఛాంబర్ లోపల జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఒత్తిళ్ల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Asian Cinemas | ఆఫీస్ బేరర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా..
తన రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. చాంబర్‌లోని కొందరు ఆఫీస్ బేరర్ల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కొందరు ఆఫీస్ బేరర్లను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ నాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి, నా మనస్సాక్షికి విరుద్ధంగా ఇకపై నేను ఇక్కడ పని చేయలేను” అని సునీల్ నారంగ్ స్పష్టం చేశారు.
Asian Cinemas | ఏకాభిప్రాయం లేదు.. ఆరోగ్యం సహకరించడం లేదు…
ఫిలిం చాంబర్ వంటి పెద్ద వ్యవస్థలో నిర్ణయాలన్నీ అందరి ఏకాభిప్రాయంతో జరగాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం లేదని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు గత కొంతకాలంగా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, అందుకే ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. తక్షణమే తనను అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని చాంబర్ కమిటీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
Asian Cinemas | కొత్త అధ్యక్షుడిగా వారిద్దరి పేర్లు…
తాను తప్పుకుంటున్న నేపథ్యంలో చాంబర్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయాన్ని కూడా సునీల్ నారంగ్ సూచించారు. తన స్థానంలో తక్షణమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పరిశ్రమకు చెందిన ప్రముఖులు శేఖర్ లేదా విజేందర్‌ల పేర్లను ఆయన సిఫార్సు చేశారు. వారిద్దరిలో ఎవరికైనా బాధ్యతలు అప్పగించవచ్చని లేఖలో పేర్కొన్నారు. సునీల్ నారంగ్ లాంటి సీనియర్ నేత, పరిశ్రమలో అందరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలా హఠాత్తుగా రాజీనామా చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఛాంబర్‌లో నడుస్తున్న అంతర్గత విభేదాలు ఈ రాజీనామాతో ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మరి ఈ రాజీనామాను చాంబర్ పెద్దలు ఆమోదిస్తారా? లేదా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? అనేది వేచి చూడాలి.
CLICK HERE TO READ MORE : Boeing 777 Aircraft | రూట్ మ్యాప్ విడుదల చేసిన ప్రభుత్వం
