ap chief minister | చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ

ap chief minister | చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ
ap chief minister | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సీఎం చంద్రబాబుకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర మంత్రులు సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంగా వారంతా ప్రియతమ నాయకుడితో పనిచేయడం గొప్ప అనుభూతిగా అభివర్ణించారు. పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడ పటమట అన్న క్యాంటీన్‌కు వచ్చారు. అన్న క్యాంటీన్‌లో పేదలకు చంద్రబాబు దంపతులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే సీఎం సార్’ అంటూ క్యాంటీన్ వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిని సీఎం ఆత్మీయంగా పలకరించి అభివాదం చేశారు.
ప్రధాని మోదీ..
సీఎం చంద్రబాబు జన్మదినం వేళ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే ఏపీ సీఎం.. తన మంచి మిత్రుడుగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని.. ఆయన మరింత ఆరోగ్యంగా ప్రజాసేవలో కొనసాగాలని మోదీ ఆకాంక్షించారు.
మెగాస్టార్ చిరంజీవి..
చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. “మీ దూరదృష్టి, పట్టుదల రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మీలాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని కలిగి ఉండటం రాష్ట్రం చేసుకున్న అదృష్టం” అంటూ ఆయన ఆకాంక్షించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకున్న విస్తారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు తన దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప బాధ్యతను స్వీకరించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడం ద్వారా, ఆయన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. “సుపరిపాలన” అనే నినాదాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
సీఎం చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన దీర్ఘాయువుతో జీవించాలని ఆకాంక్షించారు.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల..
సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్సు.. ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
మావయ్య గారూ అంటూ.. తారక్
చంద్రబాబు నాయుడుకు జూనియర్ ఎన్టీఆర్ ‘మావయ్య’ అని సంబోధిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిరంతరం నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని.. అదే పట్టుదల, విజన్‌తో మన ప్రజలకు సేవ చేసే శక్తి మీకు లభించాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం మన రాష్ట్రానికి నిరంతర అభివృద్ధిని, సమృద్ధిని, గర్వకారణమైన గుర్తింపును తెచ్చిపెడుతూ అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ తారక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తండ్రికి తనయుడి విషెస్
మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్ఫూర్తిదాయక నాయకులైన మిమ్మల్ని ‘నాన్న’గా పిలిచే అదృష్టం తనకు దక్కిందిని కొనియాడారు. ఏళ్లు గడిచే కొద్దీ ప్రజాసేవపై చంద్రబాబు తపన మరింత బలపడుతోందన్న లోకేశ్ అనుభవం, దూరదృష్టితో ముందుండి నడిపిస్తున్న తీరు ఆదర్శప్రాయమని కీర్తించారు. కష్టసమయంలో పట్టుదల, ప్రజల పట్ల అంకితభావం మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, చంద్రబాబు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్…
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నా, రాష్ట్రాభివృద్ధి కోసం మీకు అవసరమైన శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్…
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ క్షేత్రంలో అలుపెరుగని పోరాట యోధుడు చంద్రబాబు అని వికసిత భారత్ లక్ష్యంగా నవ్యాంధ్రను సీఎం తీర్చిదిద్దుతున్నారన్నారు. భగవంతుని ఆశీస్సులు చంద్రబాబుపై ఎల్లప్పుడూ ఉండాలని పీవీఎన్ మాధవ్ అన్నారు.
పెద్దనాన్నకు నారా రోహిత్..
నటుడు నారా రోహిత్ తన ‘పెద్దనాన్న’కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. “స్థైర్యం, దూరదృష్టితో ఒక ఆశయానికి ప్రాణం పోసిన గొప్ప రాజనీతిజ్ఞుడు” అంటూ చంద్రబాబుపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రముఖులందరూ చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
