ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు…

ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు…

రాష్ట్రంలో ఆహారం కొరత మాటరాదు..
ప్రజా ఉద్యమంగా అన్నా క్యాంటీన్లు..
గౌరవం సూచి శుభ్రతతో భోజనం..సీఎం చంద్రబాబు.
పుట్టినరోజు నాడు నిరుపేదలతో కలిసి అల్పాహారం..
సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలు ప్రజలు..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆహారం లేక ఎవరు బాధపడకూడదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన జన్మదినం సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్‌లో పేదలతో భార్య భువనేశ్వరి తో కలిసి అల్పాహారం స్వీకరించి ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు గౌరవప్రదంగా పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు.

పటమట అన్న క్యాంటీన్ నిర్వహణ చాలా శుభ్రంగా ఉందని పేర్కొన్నారు. రోజుకు మూడు పూటల భోజనం చేసే అవకాశం ఈ క్యాంటీన్లలో లభిస్తోందని, కేవలం రూ.5కే మంచి ఆహారం అందిస్తున్నామని చెప్పారు. బయట భోజనం చేయాలంటే ఆటో డ్రైవర్లు, కూలీలు, పేదలు కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుందని, ఈ పరిస్థితిలో అన్న క్యాంటీన్లు వారికి ఎంతో ఉపయుక్తమని వివరించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కన్సచిసనెస్ సంస్థ కేంద్ర వంటశాల ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఆహారం క్యాంటీన్లకు సరఫరా అవుతోందని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, ఇటీవల 62 కొత్త క్యాంటీన్లు ప్రారంభించామని, మరో 5 త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళం అందించిన భువనేశ్వరిని అభినందించారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమని, ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడకూడదని, ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షించారు. అన్న క్యాంటీన్లు ప్రజా ఉద్యమంగా మారాలని, సమాజంలోని అట్టడుగున ఉన్నవారిని పై స్థాయి వారు ఆదుకోవాలని కోరారు. అన్న క్యాంటీన్లలో పేదల ఆనందం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అప్పట్లో అన్న క్యాంటీన్లు మూసివేశారని, భోజనం అందించాలన్న ప్రయత్నాలకే అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.

Leave a Reply