కడప – కడపలో మహానాడు నిర్వహించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఎపి టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభివర్ణించారు. “మొదట్లో కడపలో మహానాడు నిర్వహణ సాధ్యమవుతుందా, ప్రజలు సహకరిస్తారా, ఇది జగన్ మోహన్ రెడ్డి అడ్డా కదా? అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన సహకారం చూసి చాలా ఆనందం వేసింది. వసతి కోసం ప్రజలు తమ ఇళ్లలో కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తున్నారు” అని పల్లా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు, మారుతున్న భావజాలానికి అనుగుణంగా పార్టీ చర్చించి, సంస్కరణలు తీసుకురావడానికి ఈ మహానాడు వేదిక అవుతుందని ఆయన అన్నారు. మహానాడులో తొలి ప్రసంగం చేసిన ఆయన తనకు ఈ అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
మహానాడు అజెండా, భవిష్యత్ ప్రణాళికలు
ఈ మహానాడు కేవలం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అనేక కీలక తీర్మానాలు చేయబోతున్నామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. “రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి వికేంద్రీకరణ, భావి తరాలకు మంచి నాయకులను తయారుచేసే తీర్మానాలు ఈ మహానాడులో ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. చంద్రబాబు అనుభవం, లోకేశ్ యువ నాయకత్వం పార్టీకి బలం” అని ఆయన పేర్కొన్నారు. పార్టీ పగ్గాలు అందుకునే స్థాయికి లోకేశ్ ఎదిగారని, ఇది చారిత్రాత్మక నిర్ణయంగా భావించవచ్చని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేశేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు లోకేశ్‌కు అప్పగించే అంశంపై ఈ మహానాడులో నిర్ణయం తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు
లోకేష్ నాయకత్వంపై ప్రశంసలు
నారా లోకేశ్ పార్టీని సమర్థవంతంగా నడిపించగలరన్న నమ్మకం తమకుందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. “లోకేశ్ బాబు కేవలం చంద్రబాబు నాయుడి అబ్బాయిగానో, ఎన్టీ రామారావు గారి మనవడిగానో కాకుండా, 2019 ఓటమి తర్వాత ప్రజా నాయకుడిగా రూపాంతరం చెందారు. మంగళగిరిలో సాధించిన భారీ మెజారిటీయే ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం” అని పల్లా వివరించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని అత్యధిక మెజారిటీ సాధించడం లోకేశ్ పరిణతికి నిదర్శనమని కొనియాడారు. పార్టీని నడిపించేందుకు అవసరమైన సమయం కేటాయించడం, నిరంతరం ప్రజలతో మమేకం కావడం, నాయకులతో సంప్రదింపులు జరపడం, కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేయడం వంటి లక్షణాలన్నీ లోకేశ్ కు ఉన్నాయని, ఆయన డిజిటలైజేషన్, వికేంద్రీకరణ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారని పల్లా తెలిపారు.