ఈ అయిదురోజులు జాగ్రత్త…
ఈ అయిదురోజులు జాగ్రత్త…
ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటవచ్చు… జాగ్రత్తలు పాటించండి
ప్రకటన విడుదల చేసిన గుంటూరు కలెక్టర్
గుంటూరు బ్యూరో / ఆంధ్రప్రభ : వాతావరణ సూచనలు మేరకు జిల్లాలో ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటవచ్చని, ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న ఐదు రోజులలో వేసవి తీవ్రత (హీట్ ఇండెక్స్) అధికంగా ఉంటుందని సూచించిందని అన్నారు. 41° సెల్సియస్ నుండి 50° సెల్సియస్ వరకు ఎండ వేడిమి ఉండవచ్చని తెలియజేసిందన్నారు. వడ దెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపి, తలపాగా వంటివి ధరించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని అన్నారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జన కూడళ్ల వద్ద నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ, భవన నిర్మాణ, ఇతర బహిరంగంగా చేసే శ్రమతో కూడిన పనులను చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాలకు మార్పు చేయాలని ఆదేశించారు. వడదెబ్బ తినకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అత్యవసర సమయాల్లో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి తగిన వైద్య సేవలను పొందాలని సూచించారు.
