ఆర్టీసీ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు వేగవంతం

ఆర్టీసీ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు వేగవంతం
- సమీక్షా సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి కోరారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయా జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఆర్టీసి అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, కడవ, అనంతపుం, కర్నూలు, మంగళం వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పనుల్ని చేపడుతున్న కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని, ఏపీఎస్పీడీసీఎల్, ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, జూన్ 20వతేదీ లోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.
పనులను చేపట్టే సందర్భాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినట్లయితే సంబంధిత సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను సంప్రదించి, సమస్యల్ని పరిష్కరించుకుని, పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆయూబ్ ఖాన్, గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ సంపత్ కుమార్, జనరల్ మేనేజర్ జగదీష్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు రాఘవేంద్రం, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, చంద్రశేఖర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
