ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

  • వాకాడు, చిట్టమూరు మండలాల అర్జీల పరిష్కారంపై సమీక్ష
  • డీకేటీ పట్టాల దరఖాస్తుల పరిశీలనకు కమిటీ సిఫార్సు

సూళ్లూరుపేట/గూడూరు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని గూడూరు నియోజకవర్గం వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డి, వాకాడు, చిట్టమూరు తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను శాఖల వారీగా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాకాడు మండలానికి సంబంధించిన రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలు మరియు ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు అందినట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వాకాడు మండలానికి సంబంధించి 131 అర్జీలు అందగా, వాటిలో 123 అర్జీలు పరిష్కరించామని వెల్లడించారు.

అలాగే చిట్టమూరు మండలానికి సంబంధించి వచ్చిన 49 అర్జీలలో 47 అర్జీలు పరిష్కరించడమైనట్లు వివరించారు. డీకేటీ పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటుకు సిఫార్సు చేయాలని వాకాడు తహసీల్దారును ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలంటే అధికారులు ప్రజలతో సమన్వయం కలిగి పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వంపై విశ్వాసం పెంపొందించేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply