మాకు న్యాయం చేయండి

మాకు న్యాయం చేయండి

-భీమవరం డీఎస్పీకి దళిత యువకుడి తల్లి ఫిర్యాదు

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ:
ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు వీధి నవీన్ కుమార్ మృతిపై జిల్లా ఎస్పీ పర్యవేక్షణలోనే విచారణ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, దీనిపై ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యుల వేధింపులతో పాటు పోలీసులు కొట్టడం వల్లే తన కుమారుడు వీధి నవీన్ కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ, అతని తల్లి వీధి బుజ్జి శుక్రవారం భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణును కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన కొడుకు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, కనీసం పోస్టుమార్టం నివేదికను కూడా బయటపెట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుమార్ మృతికి కారకులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బుజ్జి కోరారు.

మేజిస్ట్రియల్ విచారణ జరపాలి:
అనంతరం దళిత, ప్రజా సంఘాల నేతలు డీఎస్పీ రఘువీర్ విష్ణును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై మేజిస్ట్రియల్ విచారణ చేపట్టాలని, మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నవీన్ కుమార్‌ను కొట్టిన సదరు పోలీసులపై, అలాగే ఈ మృతికి కారణమైన ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు రక్షణ కల్పించి, పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రం అందించిన వారిలో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. క్రాంతిబాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ నేతలు మల్లిపూడి ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి, సీపీఎం ఉండి మండల నాయకులు ధనికొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దు.. డీఎస్పీ భరోసా:
బాధితులు, నాయకులతో మాట్లాడిన అనంతరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ కేసు ఏలూరు రేంజ్ ఐజీ పరిధిలో ఉందని, జిల్లా ఎస్పీ స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నరసాపురం సబ్ డివిజన్ పరిధికి చెందిన సీఐ ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతారని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా ఉంటుందని, కాబట్టి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలకు, అపోహలకు లోనుకావద్దని, బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply