ఆక్వా రైతులకు త్వరలో తీపి కబురు

ఆక్వా రైతులకు త్వరలో తీపి కబురు

జగన్ విమర్శలు వాస్తవాలకు దూరం: ఎంపీ కేసినేని శివనాథ్

విజయవాడ, ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో:
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఫీడ్ ధరల పెరుగుదల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో చర్యలు చేపడుతోందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా ఆక్వా ఫీడ్ ధరలపై ప్రభావం పడిందని వివరించారు. ఈ పరిస్థితుల్లో రైతులపై అదనపు భారం పడకుండా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కూడా ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ధరలు తగ్గించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఆక్వా రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకుండా రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, మరో ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలో రైతులకు అనుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని కేసినేని శివనాథ్ వెల్లడించారు.

Leave a Reply