రబీ ధాన్యం సేకరణలో కొత్త రికార్డు లక్ష్యం

రబీ ధాన్యం సేకరణలో కొత్త రికార్డు లక్ష్యం

తొలిసారి బాయిల్డ్ రైస్ కొనుగోళ్లకు అనుమతి.. రైతులకు భారీ ఊరట
70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
మంత్రి నాదెండ్ల మనోహర్
ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రత్యేక సమీక్ష

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) రాష్ట్ర రైతాంగానికి మరింత భరోసా కల్పించే దిశగా ఈసారి రబీ సీజన్‌లో తొలిసారిగా బాయిల్డ్ రైస్ కొనుగోళ్లకు అనుమతి లభించిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లాలోని రామవరప్పాడు, గొల్లపూడి ప్రాంతాల్లో జరుగుతున్న రబీ ధాన్యం సేకరణ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ధాన్యం తేమ శాతం తనిఖీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం విక్రయించిన తర్వాత 30 నిమిషాల నుంచి 17 గంటల వ్యవధిలోనే తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతోందని రైతులు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. తేమ శాతం అధికంగా ఉండడం, గోతాల్లో రంధ్రాలు, లారీల కొరత వంటి సమస్యలను అక్కడికక్కడే గుర్తించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు 17.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.4,410 కోట్ల చెల్లింపులు జమ చేశామని, అందులో 94 శాతం నగదు 24 గంటలలోపు చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈసారి ఇప్పటికే 80 వేల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేసి 130 శాతం అధిక సేకరణ నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీ రావు, ఇలాకియా తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply