TechTOK | మ్యాక్‌బుక్ లవర్స్ కు నిరాశే !!
- ప్రో యూజర్లకు బ్యాడ్ న్యూస్..!
- ఈ ఏడాది ఇక కష్టమే..
- 2027 వరకు వేయిట్ చేయాల్సిందే !
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : యాపిల్ మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లను కొనాలని భావిస్తున్న వారికి నిరాశ కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. యాపిల్ మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లు వేగంగా పనిచేసే, అధిక పనితీరు కలిగిన కంప్యూటర్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, సాఫ్ట్వేర్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగిస్తూ.. భారీ పనులు చేసే వారు సాధారణ ల్యాప్‌టాప్‌ల కంటే మ్యాక్‌బుక్ ప్రోను ఎక్కువగా ఎంచుకుంటారు.
మ్యాక్‌బుక్ వేగంగా పనిచేయడానికి ప్రధాన కారణం అందులో ఉండే చిప్ (ప్రాసెసర్). దీన్నే కంప్యూటర్‌కు మెదడు అని చెప్పొచ్చు. చిప్ ఎంత శక్తివంతంగా ఉంటే.. ల్యాప్‌టాప్ అంత వేగంగా పనిచేస్తుంది. ప్రస్తుతం యాపిల్ కొత్త తరం ఎం6 చిప్‌తో మ్యాక్‌బుక్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే అత్యంత వేగం, అధిక పనితీరు అందించే ఎం6 ప్రో, ఎం6 మ్యాక్స్ చిప్‌లు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేదని ప్రముఖ టెక్ నిపుణులు వెల్లడించారు.
దీంతో ఈ ఏడాది వచ్చే మ్యాక్‌బుక్ ప్రోలో సాధారణ ఎం6 చిప్ మాత్రమే ఉండే అవకాశముంది. మరింత శక్తివంతమైన ఎం6 ప్రో, ఎం6 మ్యాక్స్ మోడళ్లను తీసుకురాకుండా.. వాటి స్థానంలో నేరుగా నెక్స్ట్ జెనరేషన్ ఎం7 ప్రో, ఎం7 మ్యాక్స్ చిప్‌లను 2027లో విడుదల చేయాలని యాపిల్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
దీంతో అర్థం ఏమిటంటే… అత్యంత వేగంతో పనిచేసే, భారీ పనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యాక్‌బుక్ ప్రో కొనాలని ఎదురుచూస్తున్న వారు మరో ఏడాదికిపైగా వేచి చూడాల్సి రావచ్చు. అయితే సాధారణ వినియోగదారులు, విద్యార్థులు, ఆఫీస్ పనుల కోసం ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మ్యాక్‌బుక్‌ల ధరలను యాపిల్ పెంచింది. దానికితోడు ఇప్పుడు మరింత శక్తివంతమైన కొత్త మోడళ్ల విడుదల కూడా ఆలస్యం కావచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారు ఎక్కువ ధర చెల్లించడమే కాకుండా, మరింత ఏడాదిపాటు వేచి చూడాల్సి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, బేస్ మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర 1,999 డాలర్ల వరకు చేరినట్లు తెలుస్తోంది.
ఇక యాపిల్ నుంచి టచ్‌స్క్రీన్, ఓఎల్ఈడీ డిస్ప్లే, మరింత సన్నని డిజైన్‌తో కొత్త జనరేషన్ మ్యాక్‌బుక్ వచ్చే అవకాశాలపై కూడా చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆ మోడల్ కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు తగ్గాయని, 2027లో వచ్చే కొత్త తరం చిప్‌లతో పాటు ఈ న్యూ జనరేషన్ లాప్ టాప్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఆలస్యం వెనుక ఏఐ కీలక కారణంగా ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఏఐ ఫీచర్లు, అత్యాధునిక గ్రాఫిక్స్ సామర్థ్యాన్ని అందించే కొత్త టెక్నాలజీపై యాపిల్ పనిచేస్తోందని, అందుకే ప్రస్తుతం విడుదల చేయాల్సిన కొన్ని హై-ఎండ్ చిప్‌లను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు ఆయన నివేదికలో వెల్లడించారు. అయితే, ఈ విషయాలపై ఆపిల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
