రూ.3.43 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం..
ఖమ్మం, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కీలక చర్య చేపట్టింది. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకుని, కోర్టు ఆదేశాల మేరకు నిల్వ ఉంచిన సుమారు రూ.3.43 కోట్ల విలువైన 687.409 కిలోల గంజాయిని శనివారం తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో శాస్త్రీయ పద్ధతిలో ద్వంసం చేశారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 29 గంజాయి అక్రమ రవాణా, విక్రయాల కేసులకు సంబంధించిన మాదకద్రవ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయి భద్రత మధ్య దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసుల్లో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, నిల్వ, అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సర్వయ్య, ఇన్స్పెక్టర్ మోహన్‌బాబు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
