అమ్మవారి అన్నదానానికి రూ.6 లక్షల విరాళం

అందించిన సాఫ్ట్‌వేర్ సంస్థ సీఎండీ అనిల్ కుమార్ చింత

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చింత రూ.6 లక్షల విరాళం అందజేశారు. ఒక రోజు వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఈ విరాళాన్ని చెక్కు రూపంలో సమర్పించడం విశేషంగా నిలిచింది.

శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనిల్ కుమార్ చింత, అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి వీకే శీనా నాయక్‌ను కలిసి రూ.6,00,000 విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే అన్నదాన పథకానికి ఒక రోజు అయ్యే పూర్తి వ్యయాన్ని అందించడం ద్వారా ఎంతో సంతృప్తి, ఆధ్యాత్మిక తృప్తి కలిగింది అని అనిల్ కుమార్ చింత పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో వీకే శీనా నాయక్ మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, ఒక రోజు అన్నదానానికి అవసరమైన పూర్తి వ్యయాన్ని రూ.6 లక్షల రూపంలో విరాళంగా అందించడం ముదావహమని అన్నారు. దాతృత్వంతో ముందుకు వచ్చే భక్తుల సహకారంతో దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకం మరింత బలోపేతమవుతోందని తెలిపారు. దాతకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో సేన నాయక్ దాతకు అమ్మవారి చిత్రపటం రసీదు, ప్రసాదాలను అందజేశారు.