ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు

ఆంధ్రప్రభ, ఏ. కొండూరు: ఈనెల 9వ తేదీన ఏ.కొండూరు మండ‌లం మాధ‌వ‌రంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నామ‌ని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అన్నారు. బుధ‌వారం స్థానిక స్వ‌ర్ణ గ్రామం కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ తో క‌లిసి రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, డీఆర్‌డీఏ, వ్య‌వ‌సాయం, ఉద్యానం, ర‌వాణా, స‌ర్వే, పోలీసు త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

రీస‌ర్వే పూర్త‌యిన భూముల రైతుల‌కు రాజ‌ముద్ర‌తో ప‌ట్టాలు అందించే కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొంటార‌ని.. ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌న్నారు. కార్య‌క్ర‌మ వేదిక‌, అతిథులు కూర్చునే ఏర్పాట్లు, ప్రజల కోసం తగిన షేడ్లు, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వీఐపీ రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మార్గమధ్యంలో తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. వాస్త‌వ ప్ర‌గ‌తిని ప్ర‌తిబింబించేలా స్టాళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసర వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఫైర్ సర్వీసులు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణంలో సూచిక బోర్డులు, దిశా నిర్దేశకాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంత‌రం కార్య‌క్ర‌మం జ‌రిగే ప్రాంగ‌ణంలో చేస్తున్న ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన ఏర్పాట్ల‌ను పూర్తిచేసేలా దిశానిర్దేశం చేశారు.

Leave a Reply