Ram-Charan-Apl-2026 : రామ్‌చరణ్ సందడి Andhra Prabha Sports Story

Ram-Charan-Apl-2026 : రామ్‌చరణ్ సందడి Andhra Prabha Sports Story

  • ఏపీఎల్ కేరింత
  • మంగళగిరిలో ఉత్సాహం
  • అభిమానుల్లో ఉల్లాసం
  • కుర్రకారు ఉర్రూతలు
  • భుయి విధ్వంసక సెంచరీ..
  • రాహుల్ మెరుపు ఇన్నింగ్స్‌తో దద్దరీల్లిన స్టేడియం
  • నాలుగు పరుగుల తేడాతో రాయలసీమపై విజాగ్ లయన్స్ విజయం..
  • చివరి బంతి వరకు టెన్షన్​ టెన్షన్​
  • భీమవరం బుల్స్‌పై అమరావతి రాయల్స్ గెలుపు…

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ అభిమానుల కేరింతలతో మార్మోగింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 చివరి దశ లీగ్ మ్యాచ్‌లకు వేదికైన ఈ మైదానంలో జరిగిన రెండు హోరాహోరీ పోరులు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచాయి. ఒక మ్యాచ్‌లో సింహాద్రి విజాగ్ లయన్స్ నాలుగు పరుగుల తేడాతో రాయలసీమ రాయల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ కూడా అదే నాలుగు పరుగుల తేడాతో భీమవరం బుల్స్‌ను ఓడించి సంచలన గెలుపు నమోదు చేసింది.

Ram-Charan-Apl-2026 : రామ్ చరణ్ రాకతో..

లీగ్ చివరి దశ మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించిన రామ్‌చరణ్ యువ క్రికెటర్లకు ఏపీఎల్ గొప్ప వేదికగా మారిందని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, శాప్ చైర్మన్ రవి నాయుడు, వంగవీటి రాధ తదితరులు పాల్గొన్నారు.

Ram-Charan-Apl-2026 : భుయి బీభత్సం..

తొలి ఏ పీ ఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయలసీమ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, సింహాద్రి విజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రిష్కీ భుయి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి కేవలం 57 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ధనుష్ 26, వినయ్ కుమార్ 17, మహీప్ కుమార్ 16 పరుగులతో సహకరించారు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ రాయల్స్ చివరి వరకు గట్టిగా పోరాడినా విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ప్రతి ఓవర్‌తో ఉత్కంఠ పెరిగిన ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో వికెట్లు సాధించిన విజాగ్ బౌలర్లు జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో లయన్స్ పాయింట్ల పట్టికలో కీలక అడుగు వేసింది.

Ram-Charan-Apl-2026 : రాహుల్ రాకింగ్ ఇన్నింగ్స్‌ …

రెండో మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సందీప్ 45 పరుగులతో పునాది వేయగా, ఎస్‌వీ రాహుల్ తన కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేసిన రాహుల్ 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ఫలితంగా అమరావతి జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భీమవరం బుల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా ప్రకాష్ (45), మునీష్ వర్మ (59) అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్లారు. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైన పరిస్థితిలో లక్ష్యాన్ని అందుకోలేకపోవడంతో భీమవరం 208 పరుగుల వద్దే ఆగిపోయింది. అమరావతి నాలుగు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. అమరావతి బౌలర్లలో వర్మ మూడు వికెట్లు, అయ్యప్ప రెండు వికెట్లు సాధించారు.

Ram-Charan-Apl-2026 : చివరి వరకు ఉత్కంఠంగా..

రోజంతా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చివరి బంతి వరకు ఫలితం తేలకపోవడం, భుయి సెంచరీ, రాహుల్ విధ్వంసక ఇన్నింగ్స్‌లు, రామ్‌చరణ్ హాజరుతో మంగళగిరి ఏసీఏ స్టేడియం క్రికెట్ పండుగను తలపించింది. ఏపీఎల్-2026 లీగ్ దశ ముగింపు దశకు చేరుతున్న వేళ ప్లేఆఫ్ బెర్తుల కోసం జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.