డూప్లికేట్ నమోదులు తొలగించాలి

డూప్లికేట్ నమోదులు తొలగించాలి

ఎస్‌ఐఆర్‌లో ఓటరు వివరాలు నమోదు చేసుకున్న షబ్బీర్ అలీ

కామారెడ్డి ప్రతినిధి, జూన్ 25 (ఆంధ్రప్రభ): కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా తన ఓటరు వివరాలను నమోదు చేసుకున్నారు. ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు నమోదు ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఆయన అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అలాగే అనర్హులు లేదా ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియను సమర్థంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు అయ్యేలా అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. ఒక వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే వాటిని గుర్తించి తొలగించే ప్రక్రియకు సహకరించాలని, అదే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాల నిర్వహణపై ప్రజాస్వామ్య వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా అన్ని చర్యలు పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు సమాన విలువ ఉందని, ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి రాజకీయ పార్టీతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గ్రామాలు, వార్డులు, బూత్‌ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని, అదే సమయంలో డూప్లికేట్, అనర్హ ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.