Varanasi | అందుకే రాజమౌళి సినిమాలు గ్లోబల్ హిట్‌లు..!

Varanasi | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి దాని సత్తాను చాటాయి. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయినా దక్కాలని ఎంతో మంది నటులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్, రాజమౌళి వర్కింగ్ స్టైల్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా కోసం 20 ఏళ్లు ఎదురుచూసి, తొలిసారి అవకాశం దక్కిన దర్శకుడిలా ఆయన పని చేస్తారని అన్నారు. నటీనటులు ఉదయం 7 గంటలకు సెట్స్‌కు వస్తే, రాజమౌళి మాత్రం 5 గంటలకే అక్కడ ఉంటారని తెలిపారు. అలాగే రాత్రి అందరూ వెళ్లిన తర్వాతే ఆయన సెట్స్‌ను నుంచి వె్ళ్లారని చెప్పారు.

రాజమౌళి సెట్స్‌లో ఒక్క నిమిషం సమయాన్ని కూడా వృథా చేయరని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన విరామం కూడా కేవలం 20 నిమిషాలే ఉంటుందని వెల్లడించారు. మహేష్‌బాబుతో ఒక సన్నివేశం కోసం దాదాపు 90 టేకులు తీసుకున్నారని, అయినప్పటికీ ఆ సీన్‌ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరుసటి రోజు మళ్లీ చిత్రీకరించారని చెప్పారు.

ఒకే సన్నివేశం కోసం ఎన్నో టేకులు తీసి, ఫలితం సంతృప్తికరంగా లేకపోతే ప్యాకప్ చెప్పి మరుసటి రోజు మళ్లీ షూటింగ్ చేయించడం రాజమౌళి పనితీరుకు నిదర్శనమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బహుశా అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా ‘జక్కన్న’ అని పిలుస్తారేమో. సినిమా కోసం ఆయన చూపించే అంకితభావమే తెలుగు సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పలువురు పేర్కొంటున్నారు.

కాగా, ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన పనులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇందులో మహేష్‌బాబు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంతో రాజమౌళి మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతారని సినీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.