ఆత్మీయ పలకరింపుతో ఎన్టీఆర్ భరోసా

ఆత్మీయ పలకరింపుతో ఎన్టీఆర్ భరోసా
సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ జి.లక్ష్మీశ
జిల్లాలో 2,26,396 మంది లబ్ధిదారులకు రూ. 98.52 కోట్ల పంపిణీ
( ఆంధ్రప్రభ విజయవాడ)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ గ్రామీణ గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి పెన్షన్లను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మిశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి నెలా సమయానికి పెన్షన్లు అందించడం ద్వారా వారి జీవనోపాధికి, సామాజిక భద్రతకు భరోసా కల్పించడం ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.
జిల్లాలో మొత్తం 2,26,396 మంది లబ్ధిదారులకు రూ. 98.52 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పరిధిలో ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారులు సౌకర్యంగా సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు.
అలాగే, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు కావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
