త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి..

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి..
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
ఇచ్చాపురం,మే 1(ఆంధ్రప్రభ): ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కలయికతో రాష్ట్రం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటనను చేపట్టిన రామ్మోహన్ నాయుడు.. తొలుత పలాస నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తొలుత పలాస నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటుగా 68.39 కోట్ల నిధులతో జరిగిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం అయ్యారు.
64 కోట్లతో నిర్మించనున్న సున్నాదేవి రైల్వే ఆర్ఓబి శంకుస్థాపన, జాతీయ రహదారి నుండి కొబ్బరి చెట్లూరు వరకు 1.50 కోట్లతో నిర్మించిన బిటి రోడ్డు, కొబ్బరి చెట్లూరు రైల్వే గేటు నుండి చిన్న సుమ్మాదేవి వరకు 1.75 కోట్లతో బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, కొబ్బరి చెట్లూరు రోడ్డు నుండి కొత్తూరు వరకు 1.14 కోట్లతో నిర్మించిన BT రోడ్లను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే అశోక్ తో కలసి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 64 కోట్లతో నిర్మించనున్న కవిటి మండలం కరపాడు ఆర్వోబీ, కంచిలి మండలం జాడుపూడి లో నిర్మించనున్న మరో ఆర్వోబీ కి ఆయన శంకుస్థాపన చేశారు. జాడుపూడి రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
అనంతరం బసవకొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రం విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొందని ఎద్దేవా చేసిన రామ్మోహన్ నాయుడు.. చంద్రబాబు అభివృద్ధిను కాదని అనవసర నిర్ణయం తీసుకున్నామని ప్రజలకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు. కళ్ళముందే నరకాన్ని చూసిన ప్రజలు.. త్రిమూర్తుల వల్లే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని కూటమికి జై కొట్టారని అన్నారు. ఈరోజు ఫించనులు మొదలుకుని అన్ని సంక్షేమ కార్యక్రమాలు స్పష్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. వైసీపీ సర్కారు ఖజానా ఖాళీ చేసిన తరువాత సంపదను సృష్టించి.. నేడు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలెండర్, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
75 ఏళ్ల వ్యక్తిని అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరని.. ముగ్గురు 25 ఏళ్ల వ్యక్తులతో తాను సమానం అని ఆయన ఎప్పుడూ భావిస్తారని రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు. గతంలో మన రాష్ట్రం రాజధాని అనే ప్రశ్నకు సమాధానం లేకుండా ఉండేదని.. ప్రస్తుతం ఆ అంశంలో ఎవ్వరు చెయ్యి పెట్టకుండా ఉండేలా పార్లమెంట్ స్థాయిలో చట్టం చేసే తెగువ చంద్రబాబుకే సొంతమైందని అన్నారు.
ఇచ్చాపురం నియోజకవర్గం తనకెప్పుడు ప్రత్యేకం అని.. జాడుపూడి రైల్వే స్టేషన్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
మారుమూల ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి తల స్థానంలో తీసుకొచ్చే బాధ్యత తాను, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ లు తీసుకున్నామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఇచ్చాపురం ను తయారుచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్, ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
