రాజా వాసిరెడ్డి సేవలు చిరస్మరణీయం..
రాజా వాసిరెడ్డి సేవలు చిరస్మరణీయం..
ప్రజా సంక్షేమానికి అంకితభావంతో నిలిచిన మహారాజుకు ఘన నివాళి…
జిల్లా కలెక్టర్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో విశేష కృషి చేసి “ప్రజల రాజు”గా పేరు పొందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గుణ భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రముఖ జమీందారులలో ఒకరని తెలిపారు. గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన పరిపాలన సాగించారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, ధార్మిక సేవలు, వ్యవసాయ అభివృద్ధి, పట్టణ నిర్మాణం వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు.
1761 ఏప్రిల్ 27న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించిన వెంకటాద్రి నాయుడు, కృష్ణా జిల్లాలోని చింతపల్లి సంస్థానానికి చెందినవారని, 1783లో పట్టాభిషేకం పొందారని తెలిపారు. ప్రజలపై అధిక పన్నుల భారం మోపడానికి ఆయన వ్యతిరేకంగా నిలిచారని చెప్పారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి సమర్థవంతమైన పాలన అందించారని వివరించారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ధనాగారాన్ని సిద్ధం చేసి సహాయం చేయడంతో ప్రజలు ఆయనను “ప్రజల రాజు”గా గౌరవించారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనలో సైన్యం తగ్గించబడిన అనంతరం రాజధానిని అమరావతి (ధరణికోట)కు మార్చి అద్భుత కట్టడాలను నిర్మించారని తెలిపారు.
గుంటూరు జిల్లాలోని పొన్నూరులో అమరేశ్వరాలయాన్ని పునర్నిర్మించిన ఘనత కూడా ఆయనదేనని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దైవభక్తితో అనేక ఆలయాలను నిర్మించి ధార్మిక సేవలకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. పొన్నూరులో నిర్మించిన ఆలయాలు, గోపురాలు, తొమ్మిది ఆలయాల సముదాయం ఆయన వైభవాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ధర్మం, న్యాయం, అభివృద్ధి కోసం కృషి చేసిన మహారాజుగా గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని కలెక్టర్ కొనియాడారు. ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఈ చారిత్రక ప్రదేశాలను సందర్శించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
