చెత్తను సంపదగా మార్చితేనే స్వచ్ఛ గ్రామాలు

  • SWM రూల్స్–2026 అమలుపై కర్నూలులో భారీ అవగాహన సదస్సు

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: “చెత్తే సంపద… స్వచ్ఛ గ్రామాలే లక్ష్యం” అని రాష్ట్ర పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సుధాకర్‌రావు పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా అమలు చేస్తే గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని అన్నారు.

గురువారం కర్నూలు నగర శివారులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) రూల్స్–2026 అమలుపై విస్తృత స్థాయి అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సుధాకర్‌రావు అధ్యక్షత వహించగా, జిల్లా పంచాయతీ అధికారి గుర్రాల భాస్కర్, జడ్పీ సీఈవో రమణారెడ్డి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, డీపీఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో SWM రూల్స్–2026ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

“పెళ్లిళ్లు జరిగే కళ్యాణ మండపంలో కూడా చెత్త నిర్వహణపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం ద్వారా ఈ అంశం ఎంత ప్రాధాన్యమైనదో అర్థమవుతోంది” అని పేర్కొన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారవేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అదే చెత్తను SWPC షెడ్లలో శాస్త్రీయంగా నిర్వహిస్తే అది సంపదగా మారుతుందని వివరించారు.

జిల్లా పంచాయతీ అధికారి గుర్రాల భాస్కర్, జడ్పీ సీఈవో రమణారెడ్డి ఆధ్వర్యంలో SWPC షెడ్ల నిర్వహణ, ఇంటి స్థాయిలో తడి–పొడి వ్యర్థాల వేరు చేయడం, స్వచ్ఛ రథాల ద్వారా పొడి వ్యర్థాల సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. మొత్తం 33 అంశాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.

గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన SWPC షెడ్లను పరిశుభ్రంగా నిర్వహిస్తూ వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని అధికారులు సూచించారు. ప్రతి ఇంటి వద్దే తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు.

స్వచ్ఛ రథాల ద్వారా పొడి వ్యర్థాల సేకరణను క్రమం తప్పకుండా నిర్వహించి, వాటిని SWPC కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్ ప్రక్రియకు అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రికార్డుల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణపై కూడా మార్గదర్శకాలు జారీ చేశారు.

“స్వచ్ఛ గ్రామం – ఆరోగ్యకర సమాజం” లక్ష్యంతో ప్రతి గ్రామపంచాయతీ ఘన వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలవాలని అధికారులు పిలుపునిచ్చారు.