బడ్జెట్ అవుట్‌రీచ్‌తో ప్రజలకు స్పష్టత..

బడ్జెట్ అవుట్‌రీచ్‌తో ప్రజలకు స్పష్టత..

కర్నూలు అభివృద్ధికి భారీ కేటాయింపులు, పెట్టుబడులు
పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ దృష్టి.

మంత్రి టీజీ భరత్.

కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు.

అభివృద్ధి–సంక్షేమం సమాంతరంగా..

గత 20-21 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ పెంపుతో పాటు మూలధన వ్యయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.142 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం..

పత్తికొండ వద్ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్ల పనులు కొనసాగుతున్నాయని, ఎమ్మిగనూరులో ఏపీఐఐసీ ద్వారా రెండో దశ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమల విస్తరణ ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

జిల్లాకు రూ.2,833 కోట్ల బడ్జెట్..

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 52 ప్రధాన శాఖలకు కలిపి రూ.2,833 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, పాఠశాల విద్య, వైద్య విద్య, పంచాయతీ రాజ్, ప్రజా రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

శాఖల వారీగా కేటాయింపులు..

వ్యవసాయం రూ.42 కోట్లు, ఉద్యానవనం రూ.63 కోట్లు, పాఠశాల విద్య రూ.260 కోట్లు, వైద్య విద్య రూ.333 కోట్లు, ఫ్యామిలీ వెల్ఫేర్ రూ.174 కోట్లు, బలహీన వర్గాల గృహనిర్మాణం రూ.190 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులు రూ.120 కోట్లు, పంచాయతీ రాజ్ రూ.204 కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.349 కోట్లు, ప్రజా రవాణా రూ.187 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రధానంగా రోడ్లు, తాగునీరు, పాఠశాల మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించిందన్నారు.

భారీ పెట్టుబడులు – వేలాది ఉద్యోగాలు..

జిల్లా అభివృద్ధికి సుమారు రూ.98,979 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దీంతో సుమారు 28,903 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 38 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, వాటిలో పరిశ్రమలు 13, ఫుడ్ ప్రాసెసింగ్ 6, ఐటీ & ఎలక్ట్రానిక్స్ 2, టూరిజం 2, ఎనర్జీ రంగానికి చెందిన 14 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు.

ముఖ్య ప్రాజెక్టులకు ఆమోదం..

ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ వివరించారు. అబ్దుల్ హక్ యూనివర్సిటీకి రూ.2.50 కోట్లు, జీజీహెచ్ ఐడీపీ బ్లాక్‌కు రూ.27.60 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ స్లూయిసులకు రూ.4 కోట్లు, డబుల్ లేన్ బ్రిడ్జికి రూ.2.13 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

రోడ్లు, కాలువలు, విద్యా సదుపాయాల అభివృద్ధి..

గాజులదిన్నె ప్రాజెక్ట్ కాలువల పునరుద్ధరణకు రూ.2.60 కోట్లు, పలు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.7.38 కోట్లు, అదనంగా రూ.8.95 కోట్లు, రూ.7.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆదోనిలో మైనారిటీ విద్యా సంస్థలకు రూ.2.95 కోట్లు, ప్రభుత్వ కళాశాల భవనాలకు రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

సామాజిక మౌలిక వసతులకు ప్రాధాన్యత..

మంత్రాలయంలో షాదీఖానా నిర్మాణానికి రూ.1.80 కోట్లు, కోసిగిలో వాల్మీకి భవనానికి రూ.80 లక్షలు, ఇండోర్ స్టేడియంకు రూ.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హంద్రీ నది జంగిల్ క్లియరెన్స్, చెరువుల నింపుదల, పంట మార్పిడి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు బడ్జెట్ కేటాయింపులు స్పష్టంచేస్తున్నాయి. భారీ పెట్టుబడులు, ప్రాజెక్టుల అమలు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.