కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు..

కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు..

జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సమాజంలో మహిళలు చదువుకు దూరంగా ఉన్న కాలంలోనే తన అసాధారణ సాహిత్య ప్రతిభతో మొల్ల రామాయణం రచించిన భక్త కవయిత్రి ఆతుకూరి మొల్ల నేటి తరానికి ఆదర్శప్రాయురాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన, కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల ఎటువంటి రాజపోషణ లేకుండానే భగవంతునిపై ఉన్న భక్తితో సరళమైన తెలుగులో రామాయణాన్ని రచించి తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.

16వ శతాబ్దానికి చెందిన కవయిత్రిగా మొల్లకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను వెలికితీయాలని చెప్పడానికి మొల్ల జీవితం ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. మొల్ల రామాయణంలోని పద్యాలు నేటికీ పండిత పామరులను అలరిస్తున్నాయని, అటువంటి గొప్ప కవయిత్రి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అట్లూరి శ్రీనివాసులు, బీసీ నాయకుడు షణ్ముగం, బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష, రాయలసీమ కుమ్మరి యూత్ కార్యదర్శి హరిప్రసాద్, హరిబాబు, చలపతి, సోమశేఖర్, బీసీ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply