ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం !!

  • విద్యార్థుల్లో భయాందోళనలు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి దాటిన తర్వాత పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్‌ల మధ్య కొత్త నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో చిరుత సంచరిస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో క్యాంపస్‌లో భయాందోళనలు చెలరేగాయి.

తరచూ సంచారం.. భయంతో వణికి పోతున్న విద్యార్థులు

గత కొంతకాలంగా ఎస్వీయూ పరిధిలో చిరుతలు తిరుగాడటం విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో హెచ్ బ్లాక్ వసతి గృహం, ఎస్వీయూ క్వార్టర్స్ వద్ద చిరుత ప్రత్యక్షమై ఒక్కసారిగా హడలెత్తించిన విషయం ఇప్పటికీ అందరికీ గుర్తే.

అటవీశాఖ బోన్లు పెట్టినా.. తప్పించుకున్న చిరుత

అటవీ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నించినప్పటికీ మొదట్లో చిరుత బోనులో చిక్కకుండా తప్పించుకుంది. చివరకు రెండు నెలల క్రితం ఒక చిరుత బోనులో చిక్కడంతో దానిని ఎస్వీ జూపార్క్‌కు తరలించారు.

ఇక మళ్లీ రాత్రివేళ సంచారం

తాజాగా మళ్లీ మరో చిరుత రాత్రివేళ క్యాంపస్‌లో సంచరిస్తూ కెమెరాల్లో కనిపించడం విద్యార్థులు, సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తోంది. రాత్రివేళ ఎవరూ బయటకు తిరగకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఎస్వీయూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply