ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల ఘన చరిత్ర

ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల ఘన చరిత్ర
విశాఖసిటీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ ప్రముఖులను, మేధావులను తీర్చిదిద్దిన విద్యా నిలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పరిశోధనలకు ఆయువుపట్టుగా నిలుస్తూ, ఎన్నో ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘన చరిత్రను భావితరాలకు తెలియజేసేలా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు.
ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. శతాబ్ది ఉత్సవాల ప్రధాన ఘట్టానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరవుతుండగా, ప్రత్యేక అతిథులుగా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ పార్లమెంట్ సభ్యుడు సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కె. హరిబాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కె. రామమోహన్ నాయుడు, బి.ఆర్. శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ ఉత్సవాలకు ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిపి సుమారు 25 వేల మందికి పైగా హాజరుకానున్నారు. దీనికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు జర్మన్ షెడ్లలో 36 విభాగాలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు రెండు వైపులా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
సామాజిక, మేధో ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచిందని రాష్ట్ర ఉన్నత విద్య కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. తరాలను తీర్చిదిద్దిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిదేనన్నారు. దేశంలోనే నెంబర్ వన్ విశ్వవిద్యాలయంగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. శతాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆంధ్ర విశ్వవిద్యాలయంతో భావోద్వేగ బంధం ఉందని తెలిపారు. ఉన్నత విద్యను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయమే ప్రధమం అనే నినాదంతో అందరూ పనిచేయాలని సూచించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె.వి.వి. రావు మాట్లాడుతూ ఏయూలో విద్యాభ్యాసం పూర్వజన్మ సుకృతమని అభివర్ణించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. దార్శనిక నాయకులు వేసిన బలమైన పునాదులు అభివృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులను జ్ఞానంతో పాటు ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం అవసరమని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల బలం వారి పూర్వ విద్యార్థులే అని, ఆ దిశగా ఏయూ మరింత బలోపేతం కావాలని సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా
కార్యక్రమంలో భాగంగా ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ అవార్డులు, ఆలుమ్ని సేవా పురస్కారాలు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఉద్యోగులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు.
