Education Shock | ‘విద్యా వ్యవస్థను సర్కస్‌గా మార్చేశారు’
Education Shock | ‘విద్యా వ్యవస్థను సర్కస్‌గా మార్చేశారు’
Education Shock | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ఆలోచనపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆలోచన కాదని, నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
ఉన్నత విద్యా వ్యవస్థలో తీవ్ర అయోమయం నెలకొందని కవిత ఆరోపించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కమిషనరేట్ వేర్వేరు కోర్సులను సిఫార్సు చేస్తున్నాయని, కొన్ని విశ్వవిద్యాలయాల అనుమతి లేని కోర్సుల్లో కూడా అడ్మిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గురుకుల విద్యాసంస్థల్లో వంద మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించలేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.
జీవో నెంబర్-7 కారణంగా విద్యార్థులు నేరుగా ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మరోవైపు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టేందుకు జీవో-7ను వెంటనే రద్దు చేసి, ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా రంగానికి నష్టం కలిగించే నిర్ణయాలను ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యతిరేకించాలని కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాల్లో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
