28thaprilsplstory | కాళేశ్వరం ప్రాజెక్టు.. నిజాలు ఏమిటి?

28thaprilsplstory | కాళేశ్వరం ప్రాజెక్టు.. నిజాలు ఏమిటి?
28thaprilsplstory | హైకోర్టు తీర్పు తర్వాత మారిన రాజకీయ వాతావరణం
కేసీఆర్ దార్శనికత – కాళేశ్వరం ప్రాముఖ్యత
కుట్రలు, కుతంత్రాలు vs సత్యం – తేలిన వాస్తవాలు
28thaprilsplstory | కుట్రలు, కుతంత్రాలకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీ నైజం. భారత జాతీయ రాజకీయాల్లో కుట్రలకు కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడరని స్వయంగా ఒక ప్రధానే వ్యాఖ్యానించారంటేనే అర్థం చేసుకోవచ్చు. అందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మినహాయింపు లేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై అభూతకల్పనలు, అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. ఇటీవల హైకోర్టు తీర్పుతో అవన్నీ పటాపంచలై పోయినా, మరో కొత్త నాటకానికి తెరతీస్తుండటంపై తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టీస్ పి.సీ. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత తమ పరువు కాస్తా గంగపాలైందనే విషయాన్ని మరచిపోయి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలనే యత్నించడం వల్ల అక్కడ కూడా కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు అవ్వడం ఖాయం. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలకు తెర తీసినా, అంతిమంగా న్యాయం, ధర్మంే గెలుస్తుందనేది తెలంగాణ ప్రజల నమ్మకం.
మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా అని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్నరేళ్లుగా చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని తేటతెల్లమైంది. ‘పనికే రాదు..’ అంటూ కూసిన నోర్లే ఇప్పుడు రిపేర్ చేసి నీళ్లిస్తామని ప్రకటించాయి. అవినీతిపై విచారణ అంటూ హడావుడి చేసినా, తుదకు కోర్టు తీర్పుతో అదీ ఉత్తదేనని నిరూపితమైంది. మొదటి నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదానికి, చేస్తున్నదానికి ఏమాత్రం పొంతనలేదనేది వాస్తవం. ప్రాజెక్టును వాడుకుంటూనే వృథా అని దుష్ప్రచారం చేయడం అందుకు నిదర్శనం. వెరసి ప్రాజెక్టుపై కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. సర్కార్ కుట్రపూరిత వైఖరి బట్టబయలైంది.
ఎవరు ఔనన్నా.. కాదన్నా..
ముమ్మాటికీ తెలంగాణ జీవాధార కాళేశ్వరమే! కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించిన ముందుచూపుతో రాష్ట్ర సాగునీటి రంగంలో ఒక నూతన అధ్యాయంకి నాంది పలికింది. పాత ప్రాజెక్టులైన తుమ్మిడిహట్టి డిజైన్ల కంటే, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణానికి, తక్కువ విద్యుత్ వినియోగంతో నీటిని అందించవచ్చనే సాంకేతిక అంశాన్ని కేసీఆర్ ముందుగా గుర్తించి, దూరదృష్టితో డిజైన్ మార్పు చేయడం వల్లే కాళేశ్వరం నిర్మాణం సాధ్యమైంది.
ప్రాజెక్టును మూడేళ్లలోనే (2016-2019) పూర్తి చేయడం ద్వారా తెలంగాణ రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా ముందుచూపుతో కేసీఆర్ వ్యవహరించారు. కేవలం సాగునీరు మాత్రమే కాకుండా, తాగునీరు, పరిశ్రమలకు నీరు, భూగర్భ జలాల పెంపుదల, మరియు మిషన్ భగీరథకు నీటి నిల్వను (100 కంపోనెంట్లు) పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టును డిజైన్ చేయించిన అపర భగీరథుడు కేసీఆర్.
తెలంగాణలోని ఎండిన ప్రాంతాలను, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలకు కూడా గోదావరి నీటిని తరలించడం ద్వారా సస్యశ్యామలం చేసిన అపర చాణక్యుడు. బ్యారేజీలను కేవలం నీటిని మళ్లించడానికే కాకుండా, నిరంతరం నిల్వ చేయడం ద్వారా పంపుహౌస్ పనితీరుకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుచూపుతో వ్యవహరించారు.

తరతరాల తెలంగాణ రైతులు కరువుకాటకాల నుంచి తప్పించి వారి తలరాత మార్చేందుకు, చెక్కుచెదరని జలసంకల్ప దీక్షతో పనులను ఉరకలెత్తించి, చరిత్ర ఎరుగని అసాధారణ కాల పరిమితిలో ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఒక ప్రాజెక్టు కడితే; అందులో అవినీతి జరిగిందని నిందలు వేశారు. భారీ జలప్రవాహ వేగంలో ఒక బారేజిలోని రెండు పిల్లర్లు కుంగిపోతే.. ప్రాజెక్టే కూలిపోయిందని గావుకేకలు పెట్టారు. 83 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టును పట్టుకుని లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాకిగోల చేశారు. కళ్లముందు కాళేశ్వరం నీళ్లు పారుతుంటే గుండెలు జారి, నిద్రలు కరువై రాజకీయంగా పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలిసినోడు, తెలియనోడు.. ఎవరి నోటికి వచ్చిన.. ఎవరి బుర్రకు తోచిన అడ్డగోలు ఆరోపణలు గుప్పించారు. వాడు, వీడు అని లేదు.. చదువుకున్నోడు అంతే. చదువులేనోడు అంతే. పొడుగోడు అంతే. పొట్టోడు అంతే! మైకులు పగిలేలా నోళ్లకు పని చెప్పారు. ఆఖరుకు కరెంటు పనులు చేసుకునేటోడు కూడా నీటిపారుదల ప్రాజెక్టుల మీద తీర్పులు చెప్పాడు.
వీరావేశాలతో సిగమెత్తి సీన్లు సృష్టించారు. తెలంగాణను ఆకుపచ్చని మాగాణంగా మార్చే ఒక సజీవ అమృతజలధార మీద సముద్రమంత విషం చిమ్మారు. కానీ కాలం ఒక్కలా ఉండదు. కాలగమనంలో అబద్ధాల కోటలు బద్దలు కొట్టుకుని నిజానిజాలు వెలికివస్తాయి. కుట్రలు, కుతంత్రాల ఆయువు చిన్నది. అల్పులకు, అంగుష్టమాత్రులకు ఈ విషయం అర్థం కాదు. కుంగిన పిల్లర్ల ఆధారంగా జలప్రదాత మీద కుట్రపూరిత విచారణలు చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపారు. తర్వాత ఘోష్ కమిషన్ వేశారు. కమిషన్‌కు అడ్డమైన అబద్ధాలు చెప్పారు. తమకు కావలసిన రీతిలో నివేదిక వచ్చేలా సెలెక్టివ్ సమాచారం అందించారు. అన్నీ చేసి ఏం బావుకున్నారు? 17 నెలల విచారణ, 115 మంది సాక్ష్యాలు, బోలెడంత ప్రజల డబ్బు తగలేశారు. ఎక్కడా ఏం దొరక్క తంటాలు పడుతుంటే దింపుడు కల్లం ఆశతో కమిషన్ కాలపరిమితి అనేకసార్లు పెంచారు.
ఇంత జరిగిన తర్వాత ఇచ్చిన 650 పేజీల నివేదిక పెట్టుకుని ఆఖరుకు సాధించిందేమిటి? కోర్టు దాన్ని చెత్తబుట్టలో పడేసింది. గోదావరి నీరు మళ్లింపుతో తెలంగాణ రైతు నాలుగు డబ్బులు కళ్ల ముందే చూస్తే ఓర్చుకోలేని పచ్చ మీడియా విచారణ సాగుతున్నంతకాలం లీకుల పేరుతో ప్రజల బుర్రలను విషపూరితం చేసింది. అపర భగీరథుడు కేసీఆర్‌ను మలినపరిచే ఘాతుకానికి దిగి.. ఇక జైలే అని ఒకటి.. లేదు అరెస్టే అని మరొకటి తీర్పులు ఇచ్చింది. తాజా తీర్పుతో దిమ్మతిరిగి, కొంపలో ఎవరో పోయినట్టు సంతాపం ప్రకటించి మౌనంగా రోదిస్తోంది. ఇవాళ కాళేశ్వరం కడిగిన ముత్యంలా ప్రకాశిస్తోంది. లక్ష కోట్లు వృథా.. కాళేశ్వరం పనికిరాదు అంటూ గొంతులు పగిలేలా ప్రచారాలు చేసిన నాయకులు, పునరుద్ధరణ చేయమంటే ‘కూలిపోతే ఎలా? ప్రాణాలు పోతే ఎలా?’ అన్న మంత్రులే.. ఎల్నినో భయం వెంటాడుతుంటే చెమటలు కక్కుతూ మేడిగడ్డ సందర్శన పెట్టుకున్నారు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కాళేశ్వరాలయ దర్శనం చేసుకుని లెంపలేసుకున్నారు.
‘ప్రాజెక్టే పనికిరాదు’ అన్న నోళ్లే ఇప్పుడు పునరుద్ధరణ మాటలు మాట్లాడడంతో ఆ ఆరోపణలు బూటకమని తేలిపోయింది. ఇక తాజాగా హైకోర్టు తీర్పుతో లక్ష కోట్ల అవినీతి అన్న ఆరోపణలు గాల్లో కలిసిపోయాయి. దీనికి తోడు ‘ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, వాడు బ్యారేజీలు పనికిరావు’ అన్న నోళ్లే ఇప్పుడు తుమ్మిడిహట్టి నీళ్లు సుందిళ్ల బ్యారేజ్లో పోస్తామంటూ చెప్పడంతో కాంగ్రెస్ నేతలు, వారి తోడు దొంగలు బీజేపీ నాయకులు చేసిన ప్రచారమంతా దురుద్దేశపూర్వకమని తేలిపోయింది. ఇటీవల గంధమల్ల ప్రాజెక్టుకు శ్రీకారం.. మొన్న మేడిగడ్డ బారేజ్ పునరుద్ధరణ ప్రకటన.. నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద హైకోర్టు తీర్పు.. దానికి తోడు అవే నీళ్లు.. సుందిళ్ల బ్యారేజ్ను వినియోగించుకుంటామనే ప్రకటన.. అన్నీ కాళేశ్వరం అవసరం, ప్రాధాన్యతకు తార్కాణాలే! ఇవాళ కాళేశ్వరం అన్ని ఆరోపణల నుంచీ, అపవాదుల నుంచీ విముక్తమై, సమున్నతంగా సగర్వంగా నిలబడింది.
ఎవరు పగబట్టి ఎన్ని ఆరోపణలు చేసినా, ఎందరు కక్షగట్టి ఎంత బురద చల్లినా.. లాభనష్టాలు పిచ్చి పంతుళ్లు ఎంత తలతిక్క వాదనలు లేవనెత్తినా, పిల్లికూతలు కూసినా అన్నీ తాత్కాలిక అవరోధాలుగా మాత్రమే చరిత్రలో మిగిలిపోయాయి. కాలగమనంలో అవన్నీ కొట్టుకుపోయాయి. కాళేశ్వరం ఇప్పుడు కడిగిన ముత్యం. తెలంగాణ తల్లి మెడలో దగద్ధగాయమానంగా వెలుగులీనే జలరత్నహారం. హైకోర్టు తీర్పుకు ఒక రోజు ముందు రేవంత్ కాళేశ్వరుడిని దర్శించుకుని ఏం వేడుకున్నారో తెలియదుగానీ.. ఆ కాళేశ్వరుడు తన జటాజూటాన్ని సవరించి హైకోర్టు తీర్పు రూపంలో గంగమ్మకు విముక్తి కలిగించాడు. తెలంగాణ రైతును ఆశీర్వదించాడు.
ఏదేమైనా, తెలంగాణ సాగునీటి అవసరాల కోసం గోదావరి నదిపై చేపట్టిన ఈ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ దార్శనికతకు ఒక నిదర్శనంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భావిస్తారు. హొసూర్యుడిపై ఉమ్మివేస్తే తిరిగి తన ముఖాన పడిందనే చందాన తెలంగాణ పోరాట యోధుడు, పదేళ్ల పాలనను స్వర్ణయుగంగా మార్చిన ధీరోదాత్తుడు కేసీఆర్‌పై రేవంత్ సర్కార్ చిమ్మిన విషం చుక్కలు తిరిగి కాంగ్రెస్ పార్టీ ముఖానే పడ్డాయి. ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలు మాని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తులో పాలు పంచుకుంటే వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా దక్కుతుంది. లేదంటే ఇలాగే గాలిబుడగల ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తే మాత్రం కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయం అని ప్రజలు భావిస్తున్నారు.
కోలేటి దామోదర్,
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
