వ్యవసాయంలో టెక్నాలజీ..

వ్యవసాయంలో టెక్నాలజీ..
అమరావతి, ఆంధ్రప్రభ: టెక్ విప్లవం ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. అరచేతిలో సాగు సమాచారం… డ్రోన్లతో పిచికారీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగరాల్లో ప్రయాణం కోసం ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్లలో క్యాబ్, ఆటో, బైక్ బుక్ చేసుకున్నట్లుగానే, ఇప్పుడు వ్యవసాయ అవసరాలకు డ్రోన్లనూ బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. రైతులకు డ్రోన్ సేవలను డిజిటల్ వేదికపై అందించేందుకు ‘కిసాన్ డ్రోన్ యాప్’ లేదా ‘ఫార్మర్ యాప్’ పేరుతో ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్ ద్వారా రైతులు తమ పొలాలకు అవసరమైన డ్రోన్ సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఎరువుల పిచికారీ, క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, విత్తనాల చల్లింపు, పంటల పర్యవేక్షణ, మ్యాపింగ్, దిగుబడి అంచనా వంటి సేవలను కంపెనీల నుంచి ఎంపిక చేసుకునే వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యవసాయ ఆధునీకరణ దిశలో కీలక అడుగుగా అభివర్ణిస్తోంది.
నగరాల్లో ప్రయాణం కోసం ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్లలో క్యాబ్, ఆటో, బైక్ బుక్ చేసుకోవడం ఇప్పుడు సాధారణం. అదే విధానాన్ని వ్యవసాయ రంగానికి విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. రైతులకు డ్రోన్ సేవలను డిజిటల్ వేదికపై అందించేందుకు ‘కిసాన్ డ్రోన్ యాప్’ లేదా ‘ఫార్మర్ యాప్’ పేరుతో ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్ ద్వారా రైతులు తమ పొలాలకు అవసరమైన డ్రోన్ సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఎరువుల పిచికారీ, క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, విత్తనాల చల్లింపు, పంటల పర్యవేక్షణ, మ్యాపింగ్, దిగుబడి అంచనా వంటి సేవలను కంపెనీల నుంచి ఎంపిక చేసుకునే వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యవసాయ ఆధునీకరణ దిశగా పెద్ద అడుగుగా ప్రచారం చేస్తుండగా, మరోవైపు ఇది ప్రైవేట్ సంస్థలకు గ్రామీణ మార్కెట్ కల్పించే విధానమా అన్న చర్చ కూడా మొదలైంది.
ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ కీలక పాత్ర
రాష్ట్రంలో డ్రోన్ సేవలను సమన్వయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సంధానకర్తగా నియమించారు. 2018లో స్థాపించిన ఈ సంస్థలో పలు ప్రభుత్వ శాఖలు వాటాదారులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ యాప్ నిర్వహణ, కంపెనీల నమోదు, అర్హతల పరిశీలన, సేవల సమన్వయం వంటి బాధ్యతలు నిర్వహిస్తోంది. డ్రోన్ సేవలు అందించాలనుకునే ప్రైవేట్ సంస్థలు ముందుగా యాప్‌లో నమోదు కావాలి. వారి వద్ద ఉన్న డ్రోన్లు, పైలట్లు, సాంకేతిక నిపుణులు, సేవా సామర్థ్యం, అనుమతులు వంటి వివరాలను సమర్పించిన తర్వాత అర్హత కలిగిన సంస్థలను మాత్రమే జాబితాలో చేర్చుతారు.
రైతు తన మొబైల్ ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, మొబైల్ నంబర్‌తో నమోదు కావాలి. ఆ తర్వాత తన జిల్లా, మండలం, గ్రామం, పంట రకం, పొలం విస్తీర్ణం వంటి వివరాలు నమోదు చేయాలి. తరువాత అందుబాటులో ఉన్న సేవలను చూసి తనకు కావలసిన సేవను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు వరి పొలంలో ఎరువుల పిచికారీ, పత్తిలో మందుల స్ప్రేయింగ్, మిర్చి పంట పర్యవేక్షణ, భూమి సర్వే మ్యాపింగ్, విత్తనాల చల్లింపు. రైతు బుక్ చేసిన సేవకు సంబంధించిన తేదీ, సమయం, డ్రోన్ ఆపరేటర్ వివరాలు యాప్‌లో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజున డ్రోన్ రైతు పొలం వద్దకు వెళ్లి సేవలు అందిస్తుంది. పని పూర్తయ్యాక యూజర్ ఛార్జీలను రైతు ఆన్‌లైన్ లేదా ఇతర విధానాల్లో చెల్లించవచ్చు. భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులే ప్రధానంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏ కంపెనీ ఎంత ఛార్జీ తీసుకుంటుంది, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎంత విస్తీర్ణం పని చేస్తుంది వంటి వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. రైతు ఎంపిక చేసిన తర్వాత బుకింగ్ పూర్తవుతుంది. ఈ విధానం వల్ల రైతులకు అనేక లాభాలు కలుగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తవుతుంది. సాధారణ పిచికారీతో పోలిస్తే డ్రోన్ వేగంగా ఎక్కువ ఎకరాల్లో పని చేయగలదు.
కూలీల కొరతకు పరిష్కారం
సీజన్‌లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకని పరిస్థితుల్లో డ్రోన్లు ప్రత్యామ్నాయంగా మారవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే మందుల వినియోగంలో కచ్చితత్వం పెరిగి అవసరమైన మోతాదులోనే స్ప్రేయింగ్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పంటల ఆరోగ్య పర్యవేక్షణలో సెన్సర్లు, కెమెరాల ద్వారా వ్యాధులు, పోషక లోపాలు, నీటి సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’లో సాంకేతిక వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంటోంది. డ్రోన్ పాలసీ కూడా అదే దిశగా రూపొందించబడింది. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెంచడం, శ్రమ కొరత తగ్గించడం, పంటల నాణ్యత పెంపు, ఖర్చు తగ్గింపు లక్ష్యాలుగా నిర్దేశించారు.
రైతు సేవా కేంద్రాలపై బాధ్యతలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల సిబ్బందికి యాప్ ప్రచారం బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రతి కేంద్రం తమ పరిధిలోని రైతుల మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్‌స్టాల్ చేయించడం, నమోదు చేయించడం, సేవలపై అవగాహన కల్పించడం వంటి సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో యాప్ అమలుకు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ అందరికీ లేకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు, డిజిటల్ అవగాహన లోపం వంటి అంశాలు ప్రభావం చూపవచ్చు. డేటా రీచార్జ్ ఖర్చు కూడా రైతుపైనే పడుతుంది. అదేవిధంగా డ్రోన్ సేవల ధరలపై స్పష్టత అవసరమని రైతులు కోరుతున్నారు. ప్రైవేట్ సంస్థలే ధరలు నిర్ణయిస్తే అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక వనరుగా వ్యవసాయ డేటా
వ్యవసాయ డేటా భవిష్యత్తులో విలువైన ఆర్థిక వనరుగా మారే అవకాశం ఉండటంతో దీనిపై పారదర్శక విధానం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట రకం వంటి సమాచారం యాప్‌లో నమోదు అవుతున్నందున డేటా భద్రత కీలకంగా మారనుంది. రైతు సంఘాలు సాంకేతికతకు వ్యతిరేకం కావని, కానీ రైతు ప్రయోజనం ముందుండాలని సూచిస్తున్నాయి. సేవల ధరలకు పరిమితి ఉండాలని, చిన్న రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, యాప్ వినియోగం స్వచ్ఛందంగా ఉండాలని, గ్రామ స్థాయిలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాయి.
డ్రోన్ సాంకేతికత భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మార్చే సామర్థ్యం కలిగినదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటల్లో వినియోగం పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ రైతుకు సులభంగా, అందుబాటులో, తక్కువ ఖర్చుతో చేరితేనే ఇది విజయవంతమవుతుంది. లేకపోతే ఇది మరో ప్రచార కార్యక్రమంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని గ్రామీణ వర్గాలు పేర్కొంటున్నాయి.
