మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ (Short circuit) జరగడంతో డయాగ్నొస్టిక్ ల్యాబొరేటరీలోని ఫర్నీచర్, సిస్టమ్స్ దగ్దమైన సంఘటన మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ (laboratory) లో (ఐపిహెచ్ఎల్) (IPHL) శనివారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో స్లాబ్ కు ఫాల్ సీలింగ్ కు మంటలు చెలరేగి పైన ఉన్న థర్మకోల్ ఫ్యాన్ కాలిపోయి కిందపడింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా టేబుల్ వద్ద ఉన్న చైర్, ప్రింటర్, మౌస్, కీబోర్డ్, జీపీఎస్, సీపీయూ, మానిటర్ (monitor), బార్ కోడ్ స్కానర్స్ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో హబ్ లోని అన్ని రూములకు నల్లటి పొగ చేరింది. మిషన్లు, శాంపిల్స్ ఉన్న చోట నల్లటి పొగ, చిత్తు కాగితాలతో చిందరవందరగా మారింది. సోమవారం ల్యాబ్ కు వెళ్ళిన ఆయాలు, సిబ్బంది అక్కడి పరిస్థితిని చూసి ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని స్థానిక సూపరింటెండెంట్ (Superintendent) దృష్టికి తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే నిన్న ఆదివారం కావడంతో నైట్ డ్యూటీ చేసే టెక్నీషియన్ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఈ ఘటనతో శాంపిల్స్ సేకరణ, పరీక్షలకు అంతరాయం కలిగింది.