AP | కేంద్రమంత్రికి చంద్రబాబు అభినందనలు

వెలగపూడి : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (వైజీఎల్)-2025 గా ఎంపికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

రామ్మోహన్ నాయుడికి లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల చంద్రబాబు స్పందిస్తూ… ఇది రామ్మోహన్ నాయుడి అంకితభావం, కృషి, దార్శనికతకు లభించిన సరైన గౌరవమని కొనియాడారు. “యువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ప్రపంచ వేదికపై ‘యంగ్ గ్లోబల్ లీడర్’గా గుర్తింపు పొందడం తెలుగువారందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు.

రామ్మోహన్ నాయుడి నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత యువతరానికి స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు. ఈ గుర్తింపుతో రామ్మోహన్ నాయుడు దేశానికి, రాష్ట్రానికి మరింత సేవ చేసేందుకు ఉత్తేజితుడవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Leave a Reply