జలధార–జలహారతితో భూగర్భ జలాల పెంపు…

జలధార–జలహారతితో భూగర్భ జలాల పెంపు…
చెరువుల అనుసంధానంతో రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం.
జిల్లాలో 4,100 పనుల గుర్తింపు.. 2,100 మంజూరు.. 1,100 గ్రౌండింగ్ పూర్తి.
సోమయాజులపల్లె చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన కలెక్టర్ డా. ఏ. సిరి.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో చేపడుతున్న “జలధార–జలహారతి” కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి, చెరువుల అనుసంధానం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. మంగళవారం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమయాజులపల్లె చెరువులో చేపట్టిన పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,100 జలహారతి పనులను గుర్తించామని, అందులో 2,100 పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే 1,100 పనులు గ్రౌండింగ్ దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమయాజులపల్లె చెరువు పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఎక్కువ మంది ఉపాధి హామీ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డ్వామా అధికారులకు సూచించారు.

చెక్‌డ్యామ్ మరమ్మతులకు సంబంధించిన అంచనాలను సిద్ధంగా ఉంచుకోవాలని డ్వామా పీడీకి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచడంతో పాటు చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. సోమయాజులపల్లె చెరువు సుమారు 8.5 ఎఫ్‌టీఎం సామర్థ్యంతో ఉండగా, కొమరోలు ప్రాంతం నుంచి వచ్చే ఫీల్డ్ వాటర్‌ను రాజుకత్వ కాలువ ద్వారా చెరువులోకి మళ్లించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. చెరువులో నిల్వ అయ్యే అదనపు నీటిని కొమ్మచెరువుకు, అక్కడి నుంచి నంద్యాల జిల్లా మంచాలకట్ట చెరువుకు తరలించేలా చెరువుల అనుసంధానం చేపడుతున్నామని వివరించారు.

చెరువుల అనుసంధానం ద్వారా వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సోమయాజులపల్లె చెరువు పూడికతీత పనుల కోసం రూ.9.60 లక్షల లేబర్ కాంపోనెంట్ బడ్జెట్ కేటాయించామని, దీని ద్వారా సుమారు 3,000 పనిదినాలు సృష్టిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ 100 మంది వరకు కూలీలు పనిచేస్తుండగా, వారికి 30 రోజుల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత, ముళ్లపొదల తొలగింపు, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో చెరువులు పూర్తిస్థాయిలో నిండేలా వాగులు, కాలువలు, ఫీడర్ ఛానళ్లను శుభ్రపరుస్తున్నామని చెప్పారు.

ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు హాజరై, ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అవసరమైన చోట్ల జంగిల్ క్లియరెన్స్ వంటి పనులను యంత్రాలతో చేపడతామని తెలిపారు. జిల్లాలోని ప్రతి చెరువును పూడికతీత చేసి, ఫీడర్ చానళ్లను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి కర్నూలు ఆర్డీఓ అనురాధ, డ్వామా పీడీ నరసింహరెడ్డి, ఏపిడీ పద్మ, ఓర్వకల్లు తహశీల్దార్ విద్యాసాగర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
