అన్నీ మంచి పనులే

అన్నీ మంచి పనులే
- సంక్షేమం.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- మోదీ విప్లవాత్మక సంస్కరణలు
- అందుకే కూటమి సర్కారును దీవించాలి
- మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి
(ఒంగోలు రూరల్, ఆంధ్రప్రభ) : పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 2700 కోట్లు వృద్ధులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ (NTR Bharosa Pension) రూపంలో అందిస్తోందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గ మద్దిపాడులో బుధవారం రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి పేదలకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. దేశంలోనే పెద్డ మొత్తంలో ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) మాత్రమే అని అన్నారు. ఫించన్లు రూ.4 వేలు, 6 వేలు, 15 వేల వరకు ఇవ్వడం ఓ గొప్ప చరిత్ర అన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా తల్లికి వందనం ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున ఇచ్చామన్నారు. అన్నదాత సుఖీభవతో రైతులకు ఏడాదికి రూ.20 వేలిస్తున్నామని, దీపం, స్త్రీ శక్తి…సూపర్ సిక్స్ హమీలన్నీ అమలు చేశామన్నారు.
సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్ మెగా డీఎస్సీతో 16 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. పేద ప్రజల కోసం ప్రధాని మోదీ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వాదించాలని మంత్రి కోరారు.
