వ్యవసాయ ఎరువులన్నీ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవాలి

రైతులు ముందుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: ఇకపై యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను సైతం ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకుని కొనుగోలు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి డి. పండరి రైతులకు సూచించారు.

శుక్రవారం జుక్కల్‌ మండలంలోని మైబాపూర్‌ గ్రామంలో ఆన్‌లైన్‌ యాప్‌ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎరువుల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ విధానాన్ని తీసుకువచ్చామని, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి ఈ విధానం ప్రారంభమైందని తెలిపారు.

ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్‌, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక డిజిటల్‌ వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. రైతులు ఎరువులను ఏ డీలర్‌ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్‌లోనే ఎంపిక చేసుకుని బుకింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని, బుకింగ్‌ కాలపరిమితి రెండు రోజులు ఉంటుందని తెలిపారు.

ఇకపై ఎలాంటి ఎరువులు కావాలన్నా రైతు నమోదు చేసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. ప్రతి రైతు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

దీంతోపాటు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని పండరి సూచించారు.