మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం

తాళ్లరాంపూర్ సర్పంచ్ పావని కుటుంబానికి అండగా నిలిచిన వేల్పూర్ మండల సర్పంచులు

వేల్పూర్ (ఆంధ్రప్రభ): ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన ఏర్గుట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని వేల్పూర్ మండలంలోని 18 గ్రామాల సర్పంచులు పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చిన వారు ఈ కష్టకాలంలో తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా వేల్పూర్ మండలంలోని సర్పంచులందరూ కలిసి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అవసరమైన ప్రతి విషయంలో తోడుగా నిలుస్తామని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొని బెజ్జారపు పావనికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.