పిప్రి గ్రామంలో భారీ కొండచిలువ కలకలం

ఇంటి ముందు కోడిని మింగేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తింపు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పిప్రి (జె) గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామంలోని ఓ ఇంటి ముందు కోడిని మింగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికులు కొండచిలువను గుర్తించారు.

వెంటనే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని చంపివేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు కలకలం నెలకొంది.

గ్రామ పరిసరాల్లో అడవి ప్రాంతాలు ఉండటంతో ఇలాంటి పాములు గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

అడవి జంతువులు లేదా పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు లేదా హాని చేసేందుకు ప్రయత్నించకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.