హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో మరో 800మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా, సోమవారం సాయంత్రం ఈ నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) తో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున సీఎండీ ఎన్.బలరామ్ తో పాటు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్), ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్(పీ అండ్ పీ) కె.వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభానీ, సింగరేణి విద్యుత్ విభాగం ఉన్నతాధికారులు, బి.హెచ్.ఇ.ఎల్. నుంచి జనరల్ మేనేజర్, హెడ్ పార్థసారథి దాస్, జీఎం జోగేష్ గులాటి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ… గరిష్టంగా నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నప్పటికీ, 40 నెలల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా వచ్చే నెల నుంచే పనులు ప్రారంభించాలన్నారు. ఇచ్చిన షెడ్యూల్ లోపే పనులు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పవర్ ప్రాజెక్టు ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకుని త్వరితగతిన ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.
ఈసందర్భంగా బీహెచ్ఈఎల్ జీఎం అండ్ హెడ్ పార్థసారథి దాస్ మాట్లాడుతూ.. సింగరేణి పవర్ ప్లాంట్ ను అతి ప్రాధాన్య ప్రాజెక్టుగా తమ బోర్డు నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో పనులను వెంటనే ప్రారంభిస్తామన్నారు. గతంలో చేపట్టిన 1200 మెగావాట్ల ప్రాజెక్టులో ఎదురైన సమస్యలను ముందే అధిగమించేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
ప్లాంట్ పూర్తయితే ఏటా రూ.300 కోట్ల లాభాలు…
ఈ ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్ సంస్థ 800మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి బాయిలర్స్, టర్బైన్స్, జనరేటర్ల (బి.టీ.జి.) ఏర్పాటుతో పాటు అన్ని రకాల సివిల్ తదితర అన్ని నిర్మాణాలను 48నెలల్లో అనగా నాలుగేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం సింగరేణి సంస్థ 2016లో పూర్తయిన 1200మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం విజయవంతంగా నడుస్తూ కంపెనీకి ప్రతి ఏడాది సుమారు 450 కోట్ల రూపాయల వరకు లాభాలను ఆర్జించి పెడుతుంది. ఇప్పటివరకు ఈ ప్లాంటు సుమారు 70వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ను రాష్ట్ర అవసరాలకు అందించింది. ఈ నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పలుమార్లు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోకెల్లా అత్యధికంగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీ.ఎల్.ఎఫ్.) సాధిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది.
ఈ ప్లాంట్ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇదే ప్రాంగణంలో సింగరేణి సంస్థ మరో యూనిట్ స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనితో ఈ కొత్త ప్లాంట్ కు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ పూర్తయితే సింగరేణి సంస్థకు ఏడాదికి మరో 300కోట్ల రూపాయల వరకు లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఇది సింగరేణి ప్రగతికి ఎంతో దోహదపడుతుంది.