BJP MLA | అసభ్య వ్యాఖ్యలు ఖండనీయం…
BJP MLA | అసభ్య వ్యాఖ్యలు ఖండనీయం…
- చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి
- మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి
BJP MLA | భవానీపురం, ఆంధ్రప్రభ : ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ రోజు స్పందించిన ఆయన, రాష్ట్ర రాజకీయ వాతావరణం ప్రజల్లో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యంగా మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిగతంగా లేదా భౌతికంగా దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి ఘటనలను ఎప్పటికీ సహించరని, సమస్యలను చట్టబద్ధంగానే పరిష్కరించడమే ఆయన రాజకీయ ధోరణి అని సుజనా చౌదరి గుర్తు చేశారు. పరిస్థితిని చట్ట పరిధిలోనే నియంత్రిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన తెలిపారు. ప్రజలంతా సంయమనం పాటిస్తూ అవగాహనతో వ్యవహరించడమే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు శ్రీరామరక్ష అని పేర్కొంటూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దాడులకు తావివ్వకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు.
