బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన…

బుక్ పేరుతో రాజ్యాంగ విరుద్ధ పాలన…
రాష్ట్రంలో తిరోగమనంలో ప్రజాస్వామ్యం
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకుని పౌర హక్కులను హరిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అరాచక పాలనను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ మీడియా విభాగం జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరిని అరెస్టు చేసిన తీరును ఆయన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, తీవ్రవాదులను వేటాడినట్టు ఒక సీనియర్ జర్నలిస్టును భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
అధికారం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మాని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ధర్మాన హెచ్చరించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం ప్రజలకు ఉత్తమమైన ఫలితాలివ్వాలంటే ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన వ్యవస్థలన్నీ నిష్పాక్షికంగా పనిచేయాలని,. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయని ధర్మాన అన్నారు. అయితే 80 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే మనం వెనక్కి వెళ్తున్నామనిపిస్తోందని,. పౌరుల హక్కులను హరించే కార్యక్రమం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పనిచేయకూడదనే వాతావరణం, ప్రజలకు ఏమీ తెలియకూడదనుకునే పాలకులు ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
ఇందులో భాగంగా అధికారంలో ఉన్నవాళ్లు వ్యవస్థలను తమ చేతుల్లోకి లాక్కుంటున్నారన్నారు . ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను స్వతంత్ర్యంగా పనిచేయనివ్వకపోవడం వంటి తిరోగమన చర్యలే నేడు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయని . దాదాపు 40 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న మాలాంటి వాళ్లకి… ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం రోజురోజుకీ ఆధ్వాన్న స్ధితిలోకి జారిపోతున్నట్టనిపిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లు మొత్తం పరిపాలన అంతటినీ కేవలం వారి కుటుంబానికి ఆపాదించుకుని, వారి వ్యతిరేకులందరినీ హింసిస్తాం, నోరెత్తకుండా చేస్తామన్నట్టు వ్యవహరిస్తున్నారని,. చివరకు ప్రధాన ప్రతిపక్షంలో పనిచేస్తున్న వారందరినీ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారని అగ్రహించారు.
ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ నేరుగా రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, అందులో ఉన్నవారందరినీ వేధిస్తున్నాం. ఇదే మా పరిపాలన అనే బహిరంగంగానే గానే చెబుతున్నారని విమర్శించారు . దేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి 29 రాష్ట్రాలున్నాయని,. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? అని ప్రశ్నించారు
పూడి శ్రీహరి అరెస్టు అప్రజాస్వామికం…
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైస్.జగన్ కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ (మీడియా విభాగం) గా ఉన్నపూడి శ్రీహరిని అరెస్టు చేశారు. అరెస్టులో మీరు అనుసరించిన విధానం చాలా దుర్మార్గం. కనీసం నోటీసు ఇవ్వలేదు. సాక్ష్యాధారాలు సేకరించకుండా.. పోలీసులు రెక్కీ నిర్వహించిన తీవ్రవాదులను వెంటాడినట్టు వేటాడి, భయబ్రాంతులకు గురిచేశారు.
ఇళ్లలో కనీసం వారెంటు కూడా లేకుండానే తనిఖీలు చేపట్టారు. వారి వద్దనున్న సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లాక్కొన్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన కుమారుడు వచ్చే తరానికి పాలన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇస్తున్నారు? ఇదేనా పరిపాలన? దీనివలన మెజారిటీ ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందా? ఇలాంటి పాలన చేసి ఎవరైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు.
రానున్న తరాలకి మీరు తప్పుడు సందేశం ఇస్తున్నారన్నారు .
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ప్రధాన కేంద్రమని, దానిని అణిచివేయాలని చూడటం పాలకుల అవివేకమని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం ఇంత వేగంగా ప్రజాదరణ కోల్పోవడానికి రెడ్ బుక్ పేరుతో సాగిస్తున్న దమనకాండ, అక్రమ మైనింగ్ మాఫియాలే కారణమని విమర్శించారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలు వ్యవస్థలను శాశ్వతంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను వీడి, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ పాలన సాగించాలని.. లేనిపక్షంలో అణిచివేతను ఎదురించి ఉప్పెనలా రాబోయే ప్రజాక్షేత్రంలో పాలకులకు పరాభవం తప్పదని ధర్మాన గట్టిగా హెచ్చరించారు. నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఇరవై ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఈ విధంగా ప్రభుత్వాన్ని నడపడం సరికాదన్నారు. ఇవాళ నీ అవసరాల కోసం వ్యవస్ధలో ఉన్న అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తే… అది నీ ఒక్కడితో ఆగిపోదు.
నీకు అవసరం లేకపోయినా వాళ్లు ప్రజల విషయంలో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్నారు. నీ అవసరం కోసం ఒక సందర్భంలో చట్టానికి వ్యతిరేకంగా ఒక అధికారికి పనిచేయడానికి అవకాశం ఇస్తే… అదే వ్యవస్థతో అలాంటివి వేలాది ఘటనలు చేసే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్షం ఉండకూడదని భావిస్తున్నారా? అలాంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా? ఇలాంటి అరెస్టుల ద్వారా ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది ఒట్టి భ్రమ మాత్రమేనని, ప్రతిపక్షమే ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రధాన కేంద్రమన్నారు ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించారు. కాబట్టే ఇవాళ రెండేళ్లలోనే ప్రజలు 50 శాతానికి పైగా వైయస్.జగన్ ని సమర్థిస్తున్న పరిస్థితి. కేవలం రెండేళ్లలోనే ఇంత వేగంగా ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వం గతంలో లేదన్నారు.
