పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం…

పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం…
కొత్త కాలువల నిర్మాణంతో మురుగు సమస్యకు చెక్ – ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం పట్టణ అభివృద్ధికి కీలకంగా నిలిచే బలగ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు రోడ్డు విస్తరణ పనులను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై శంకుస్తాపన చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందన్నారు. విస్తరించిన రహదారి ద్వారా వాహనదారులకు సౌకర్యం కలగడంతో పాటు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పాత రహదారిని విస్తరించడంతో పాటు పాదచారులకు సురక్షితంగా నడిచేలా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సూచికలు, లైటింగ్ సదుపాయాలు కూడా కల్పించనున్నారు. రోడ్డు విస్తరణతో పాటు ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త కాలువల నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు.
వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక ప్రమాణాలతో కాలువలను నిర్మించి, నీటి పారుదల సక్రమంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
స్థానికులు కూడా ఈ అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, ప్రధాన విజయరామ్, రెడ్డి శంకర్, చిట్టి నాగభూషణం, అందవరపు సంతోష్, కొర్ను ప్రతాప్, దేవెళ్ల విశ్వనాథ్,మూకళ్ళ సింహాద్రి నాయుడు, చిట్టి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
