నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా..

నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా..
టీటీడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి
తిరుపతి(రాయలసీమ బ్యూరో) ఆంధ్రప్రభ : పవిత్ర రామాయణం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కి చెందిన బీజేపీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడి) బోర్డు సభ్యుడు భానుపకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు మరో బీజేపీ నాయకుడు, అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా రూ 100 కోట్లకు పరువునష్టం దావా నోటీసు ను శనివారం పంపించారు. ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ రామ రావణ యుద్ధం పండ్ల కోసం జరిగిందని రామాయణాన్ని అపహాస్యం చేస్తూ పలు వ్యాఖ్యలు చేసారు..
దానికి ప్రతిష్పందనగా ప్రపంచంలో హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీసే విధంగా రామాయణ పవిత్ర గ్రంధాన్ని అవహేళన చేస్తూ, చౌకబారు వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ ను భాను ప్రకాష్ తీవ్రంగా విమర్శించారు. దేశం గర్వించే పురుషోత్తముడి చరిత్ర అయిన రామాయణం పై చేసినట్టు ఇతర మత గ్రంధాలపై దిగజారుడు వ్యాఖ్యలను చేయగలరా అని ప్రశ్నించారు. తరచుగా హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యాఖ్యలు చేయడం ప్రకాశ్ రాజ్ లాంటి వారికి ఫ్యాషన్ అయిపోయిందని, అటువంటి వారికి బుద్ది చెప్పడానికే కేసు వేస్తున్నట్టు ఆయన తెలిపారు.
