since2015 | వేసవిలో జంతువులు, పక్షులకు వరమైన సేవా కార్యక్రమం

since2015 | వేసవిలో జంతువులు, పక్షులకు వరమైన సేవా కార్యక్రమం
since2015 | మూగజీవాల దాహం తీర్చే సేవా కార్యక్రమం
వాటర్ ఫర్ వాయిస్ లెస్ విస్తరిస్తున్న సేవలు
ప్రతి ఇంటి ముందు నీటి పాత్ర… ప్రాణాలకు ఆదారం
సమాజంలో కరుణ పెంపొందిస్తున్న ఉద్యమం
చిత్తూరులో సేవలందిస్తున్న వాటర్ ఫర్ వాయిస్ లెస్
మూగజీవాల కోసం ఉచితంగా నీటి పాత్రల పంపిణీ
since2015 | ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నోరులేని పశువులు, పక్షులు తీవ్రమైన దాహంతో ప్రాణాల కోసం పోరాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక పాత్ర నీరు… వేల మూగజీవాలకు ఆదారం అనే స్ఫూర్తిదాయక నినాదంతో ముందుకొచ్చిన నోరులేని జీవాలకు నీరు అందుకుంటోంది బెంగళూరుకు చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ పేరు వాటర్ ఫర్ వాయిస్ లెస్. చిన్న చర్యతో పెద్ద మార్పు తీసుకురావచ్చని ఈ సంస్థ నిరూపిస్తోంది. చిత్తూరులో కూడా తమ కార్యకలాపాలను గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. నోరులేని మూగజీవాలకు తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. చిత్తూరులో ఇప్పటివరకు వేయికి పైగా చిన్న నీటి తొట్టెలను సరఫరా చేసింది. భవిష్యత్తులో పలమనేరు, మదనపల్లి, వేలూరులో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది.

2015లో సన్నీ హస్తిమల్ స్థాపించిన ఈ స్వచ్ఛంద సేవా సంస్థ జంతువులు, పక్షులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. దాహం తీర్చండి ప్రాణాలను కాపాడండి అనే ధ్యేయంతో పనిచేస్తూ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ నీటి పాత్రలను పంపిణీ చేసింది. ఈ నీటి పాత్రలు సాధారణ మట్టి పాత్రల కంటే బలంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. చిన్న పక్షులు, కుక్కలు, పిల్లులు తాగేందుకు చిన్న పరిమాణంలో, గోవులు, ఎద్దులు వంటి పెద్ద జంతువులకు పెద్ద పరిమాణంలో ప్రత్యేకంగా రూపొందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

మన ఇంటి ముందు ఒక చిన్న నీటి పాత్ర ఉంచితే ఎన్ని మూగజీవాలకు ప్రాణాధారం కల్పించవచ్చో స్పష్టమవుతుంది. ఈ ఆలోచనతోనే ప్రతి ఇంటి ముందు నీటి పాత్ర ఉంచాలని సంస్థ పిలుపునిస్తోంది. మనకు చిన్న విషయం అనిపించే ఒక పాత్ర నీరు, మూగజీవాలకు జీవం లాంటిదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సేవలో స్వచ్ఛంద సేవకులు, జంతు ప్రేమికులు, సమాజ సేవకులు పెద్దఎత్తున భాగస్వామ్యం అవుతున్నారు. వారు తమ ఇళ్ల ముందు, మేడలపై, బాల్కనీల్లో, కాలనీల్లో ఈ నీటి పాత్రలను ఉంచి ప్రతిరోజూ నీటిని నింపుతున్నారు. దీని ద్వారా వేసవిలో దాహంతో అలమటించే జంతువులకు ప్రాణాధారం లభిస్తోంది.

బెంగళూరులో ఈ కార్యక్రమం విశేష స్పందన పొందింది. అక్కడ నిర్వహించిన ఒక పెద్ద ప్రదర్శనలో సంస్థ స్టాల్ ఏర్పాటు చేయగా, అనేక మంది ప్రజలు నీటి పాత్రలను తీసుకుని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు బెంగళూరులోనే 2,200కు పైగా నీటి పాత్రలను పంపిణీ చేసినట్లు సేవకులు తెలిపారు. ఉల్సూర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, హెచ్బిఆర్ లేఅవుట్, యశ్వంత్‌పూర్, పీన్య వంటి ప్రాంతాల్లో 12 కేంద్రాల ద్వారా ఈ సేవ కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నీటి పాత్రలను ఉంచిన వెంటనే కుక్కలు, పక్షులు నీరు తాగుతున్న దృశ్యాలను ప్రజలు పంచుకోవడం, ఈ సేవకు మరింత ప్రోత్సాహం ఇస్తోంది. ఈ విషయమై వాటర్ ఫర్ వాయిస్ లెస్ ప్రతినిధి సుప్రియా మాట్లాడుతూ నీటి పాత్రలు ఉంచడం మాత్రమే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యంని తెలిపారు. నీటిని తరచూ మార్చకపోతే దోమలు పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చిత్తూరు జిల్లాలో కూడా ఈ సేవా కార్యక్రమం విస్తరిస్తోంది. రామ్నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన కలెక్షన్ కేంద్రంలో నీటి పాత్రలు అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ నమోదు ద్వారా ఈ పాత్రలను పొందవచ్చు. ఇప్పటికే అనేక మంది తమ ఇళ్ల ముందు నీటి పాత్రలు ఉంచి సేవలో భాగస్వామ్యం అవుతున్నారు. స్థానికంగా జంతు ప్రేమికులు, యువత పెద్దఎత్తున ముందుకు వస్తూ కాలనీల్లో, వీధుల్లో నీటి పాత్రలను ఏర్పాటు చేస్తున్నారు. మన ఇంటి ముందు ఒక పాత్ర నీరు ఉంచితే… అది ఒక మూగజీవానికి జీవం లాంటిది అనే భావనతో ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేవలం జంతువుల దాహం తీర్చడమే కాకుండా, సమాజంలో కరుణ, బాధ్యత భావనలను పెంపొందిస్తోంది. దాహంతో అలమటించే జంతువులు ఆగ్రహంగా మారే అవకాశాలు ఉండగా, నీరు అందించడం ద్వారా మనిషి-జంతు ఘర్షణలు కూడా తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తులో వనరుల లభ్యత ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిస్తున్నారు. మరిన్ని వివరాలకు చిత్తూరు రాంనగర్ కాలనీలోని వాటర్ ఫర్ వాయిస్ లెస్ కేంద్రాన్ని 9740888828 ఫోన్ నెంబర్ తో సంప్రదించవచ్చని చిత్తూరు ప్రతినిధి విశ్వతేజ తెలిపారు. నాలుగు సంవత్సరాల నుండి చిత్తూరు పట్టణంలో సేవలందిస్తున్నామని ఇప్పటివరకు వేయికి పైగా పాత్రలను ఉచితంగా అందజేశామన్నారు. ఈ పాత్రలు దుర్వినియోగం కాకుండా అవసరమైన వారిని గుర్తించి అందజేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో తమ కార్యకలాపాలను పలమనేరు, మదనపల్లి, వేలూరులలో కూడా విస్తరించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
పలమనేరు సమీపంలో రోడ్డుమీదికి వచ్చి, మూడు ఏనుగులు మరణించడం తనను కలిచివేసిందన్నారు. ఈ విషయమై బెంగళూరులోని వాటర్ ఫర్ వాయిస్ లెస్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా ఆ పలమనేరు అడవి ప్రాంతంలో ఏనుగులు తిరిగే కారిడార్ లో ఏనుగుల కోసం రెండు పెద్ద నీటి తొట్టెలను నిర్మించడానికి అనుమతి ఇచ్చారన్నారు. అటవీశాఖ అధికారులను సంప్రదించి వారి సహకారంతో త్వరలోనే పలమనేరులో ఏనుగుల కోసం నీటి తోటలను కూడా నిర్మిస్తామని విశ్వతేజ్ వివరించారు.
వేసవి కాలంలో ఒక చిన్న నీటి పాత్ర అనేక ప్రాణాలను కాపాడగలదు. ప్రతి ఇంటి ముందు ఒక పాత్ర నీరు ఉంచితే అది నోరులేని జీవాలకు అమృతధారగా మారుతుంది. మన సంస్కృతిలో ఉన్న జీవదయ భావాన్ని ఆచరణలో పెట్టే ఈ సేవా కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.

