ప్రతి కుటుంబ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

ప్రతి కుటుంబ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

జనగణన ప్రక్రియపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష

చిత్తూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో జరుగుతున్న జనగణన ప్రక్రియలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జనగణన పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2011 జనగణన గణాంకాలతో పోలిస్తే ప్రస్తుత నమోదుల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లు, వలసల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనాభా నమోదులో తేడాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన సమాచారాన్ని నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబాల వివరాలను విశ్లేషించి ఇంకా నమోదు కాని కుటుంబాలను గుర్తించాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో మిగిలిపోయిన ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాల వివరాలను సక్రమంగా నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనగణన గణాంకాలు భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక నిధుల కేటాయింపుపై ప్రభావం చూపుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

16వ, 17వ ఆర్థిక సంఘాల నిధుల పంపిణీలో జనాభా గణాంకాలు కీలక ప్రమాణాలుగా పరిగణించబడతాయని తెలిపారు. అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా గణాంకాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

కొన్ని మండలాల్లో 2011 జనాభాతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ నమోదులు ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వలసలు, పాడైపోయిన ఇళ్లు, ఖాళీ గృహాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు లేదా నగరాలకు వెళ్లిన కుటుంబాలు ప్రధాన కారణాలని వివరించారు.

తక్కువగా కానీ, ఎక్కువగా కానీ నమోదు చేయకుండా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా జనగణన జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు.

ఇంకా నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పురోగతిని పరిశీలిస్తామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను పరిశీలిస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో ఎన్యుమరేటర్లు, జిల్లా గణాంక అధికారులు, మండల స్థాయి గణాంక అధికారులు, ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Leave a Reply