కనీస మద్దతు ధర అందేలా చూడాలి
కనీస మద్దతు ధర అందేలా చూడాలి
మల్లు రవి
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను బుధవారం సాయంత్రం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, మరియు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సంయుక్తంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందులపై వారు ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి తిమ్మసానిపల్లికి చెందిన రాము అనే రైతుతో ఫోన్లో నేరుగా మాట్లాడారు. పంట దిగుబడి, కొనుగోలు విధానం, తూకం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, తేమ శాతం రికార్డులను అధికారులు ఏ విధంగా నమోదు చేస్తున్నారో స్వయంగా తనిఖీ చేశారు.
ఎంపీ మల్లు రవి ఆదేశాలు..
- ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రతి రైతుకూ అందేలా చూడాలి.
- టోకెన్ల జారీలో పారదర్శకత ఉండాలి, రైతులకు అనవసర వేచిచూపులు లేకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలి.
- ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
- చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేగంగా జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలును వేగవంతం చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. గన్ని సంచుల కొరత లేకుండా: నేరుగా రైతుల వద్ద నుండే గన్ని సంచులు సేకరించి, వాటికి సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు వెల్లడించారు. యార్డ్లో తాగునీరు, నీడ, విశ్రాంతి గదులు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు.
ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హెచ్చరిక..
కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం ఉంటే సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బంది కలిగించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
