Achampet | పట్టు పరిశ్రమలతో రైతులకు అధిక లాభాలు
Achampet | పట్టు పరిశ్రమలతో రైతులకు అధిక లాభాలు
- తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత
అచ్చంపేట, ఆంధ్రప్రభ: పట్టు పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలంగాణ పట్టు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన పట్టు పరిశ్రమల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టు పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్లు, పరికరాల ఏర్పాటు కోసం సబ్సిడీలు, రాయితీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టు పరిశ్రమలను స్థాపించి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.
గ్రామంలో ఇప్పటికే పట్టు పరిశ్రమలు నిర్వహిస్తున్న రైతులు గత రెండు, మూడు సంవత్సరాలుగా మంచి లాభాలు పొందుతున్నట్లు తమ అనుభవాలను సభలో పంచుకున్నారు. పట్టు సాగు, పట్టు పురుగుల పెంపకం, మార్కెటింగ్ అవకాశాలపై అధికారులు రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నం, అసిస్టెంట్ డైరెక్టర్ జనార్ధన్, హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ మాధురి పాల్గొన్నారు. ఆదర్శ రైతు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.
