హాస్టల్.. ఆకస్మిక తనిఖీ..
హాస్టల్.. ఆకస్మిక తనిఖీ..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల ఎస్సీ బాలుర హాస్టల్ లో మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి సోమవారం రాత్రి ‘హాస్టల్ నిద్ర’ చేశారు. ముందుగా ఆయన హాస్టల్ అంతటా కలియతిరిగి విద్యార్థుల సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
చదువు వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. హాస్టల్ వార్డెన్ కె. సుధాకర్ కు పరిసరాల పరిశుభ్రత పై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డైనింగ్ హాల్, బాత్రూమ్లు, పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. త్రాగునీటి సౌకర్యం, స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పర్యవేక్షణలు కొనసాగుతాయని కమిషనర్ వెంకట రామిరెడ్డి తెలిపారు.

