Accidents | జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి
Accidents | జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి
- ఎన్.హెచ్ పీడీకి యార్లగడ్డ విజ్ఞప్తి
Accidents | గన్నవరం, ఆంధ్రప్రభ : చెన్నై, కోల్ కత్తా జాతీయ రహదారిపై గన్నవరం నియోజకవర్గం పరిధిలో నాటికి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జాతీయ రహదారుల సంస్థ అధికారులను కోరారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ కు వినతిపత్రం అందచేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని యార్లగడ్డ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను డిమాండ్ చేశారు.
65 నెంబర్ జాతీయ రహదారి బొమ్ములూరు టోల్గేట్ నుంచి గన్నవరం ఆర్టీవో చెక్పోస్ట్ వరకు ఉన్న 33 కిలోమీటర్ల పొడవునా 2024 వ సంవత్సరం 102 ప్రమాదాలు జరగగా ఈ ఏడాది ఇప్పటివరకు 84 ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ 33 కిలోమీటర్ల పరిధిలో నే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీరవల్లి హెచ్పి ఆయిల్ బంకు వద్ద జాతీయ రహదారి మలుపు ఉండటంతో అక్కడ అధికవేగంతో వీళ్ళే వాహనాల వేగం కంట్రోల్ అవ్వక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా పెద్దావుటపల్లి ఫ్లైఓవర్ నుంచి ఆర్టీవో చెక్పోస్ట్ వరకు రోడ్ ప్రమాదాలు ఎక్కువగా జరగడంతో పాటు ప్రాణ నష్టం అధికంగా ఉందన్నారు.
ఆర్టీవో చెక్పోస్ట్ సమీపంలో ఈ నెల 23వ తేదీ ఉదయం, రాత్రి ఒకేరోజు రెండు ప్రమాదాలు జరగటం ప్రమాదాల తీవ్రతకు అద్ధం పడుతుందన్నారు. జాతీయ రహదారిపై వాహనాల అతివేగంగా వెళ్లడం ప్రమాదాలకు ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల వద్ద, మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వచ్చే వైపు పెద్దావుటపల్లి నుండి ఆర్టీవో చెక్పోస్ట్ వరకు జాతీయ రహదారి 1075 కిలోమీటర్ల నుంచి 1077 కిలోమీటర్ల వరకు ‘ వై ‘ ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మిస్తే ప్రమాదాలు నివారణకు వీలుంటుందని వివరించారు.
చిన్న వటపల్లి బైపాస్ ప్రారంభంలో రహదారి అనుసంధానం పూర్తి చేయాలని, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఆర్టీవో చెక్పోస్ట్ వరకు రానీయకుండా ముందుగానే మళ్లించాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారి పై పాఠశాలలు ఉన్న చోట్ల వాహనాల వేగ నియంత్రణకు మూవింగ్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్లు ప్రారంభంలో క్యాట్ ఐ లు, రేడియం స్టిక్కర్లు, బ్లింకింగ్ రెడ్ లైట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వీస్ రోడ్లు ప్రారంభం అయ్యే చోట్ల వాహన దారులకు కనిపించేలా సూచికలు ఏర్పాటు చేయాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు.
