క్వాలిటీ సర్టిఫికెట్ వెనుక గుట్టు.. వలలో చిక్కిన అధికారి
క్వాలిటీ సర్టిఫికెట్ వెనుక గుట్టు.. వలలో చిక్కిన అధికారి

నందికొట్కూర్, ఆంధ్రప్రభ విద్యార్థుల కోసం చేపట్టే పాఠశాల భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో లంచం డిమాండ్ చేసిన సర్వ శిక్షా అభియాన్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రమేశ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
జూపాడు బంగ్లా, మిడుతూరు మండలాల్లో చేపట్టిన పాఠశాల భవనాల నిర్మాణ పనులకు సంబంధించి సుమారు రూ.6 లక్షల బిల్లులు విడుదల చేయడానికి అవసరమైన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఏఈ రమేశ్ రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
లంచం ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వల పన్నారు.
శనివారం బ్రాహ్మణకొట్కూరు జాతీయ రహదారిపై కాంట్రాక్టర్ నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఏఈ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అధికారులు కారు బానెట్‌పైనే పంచనామా నిర్వహించారు. ఫినాఫ్తలీన్ పౌడర్ పూసిన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో నిందితుడు చేతులు కడిగిన నీరు గులాబీ రంగులోకి మారడంతో లంచం స్వీకరించినట్లు నిర్ధారణ అయింది.
సాక్ష్యాధారాలుగా నగదు, రసాయన పరీక్ష నమూనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏఈ రమేశ్‌ను అరెస్టు చేశారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు వెల్లడించారు.
