కోర్టు కేసుల నిరూపణే లక్ష్యం.. బాధితులకు న్యాయం జరగాలి

కోర్టు కేసుల నిరూపణే లక్ష్యం.. బాధితులకు న్యాయం జరగాలి

  • నిందితులకు శిక్షలు పడేలా కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
  • ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
  • జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎన్. యుగంధర్ బాబు ఉన్నత స్థాయి సమీక్ష

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులు, నంద్యాల సబ్ డివిజన్ పోలీసు అధికారులతో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్లలోని కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు, సాక్ష్యాధారాల ప్రవేశం, మరియు నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్రపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరగాలన్నా, సమాజంలో నేరాల శాతం తగ్గాలన్నా కోర్టులలో కేసుల నిరూపణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ఎంత కష్టపడి దర్యాప్తు చేసినప్పటికీ, కోర్టులో సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి కేసును నిరూపించి, నిందితులకు శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. ఆ మహత్తర బాధ్యత కోర్టు కానిస్టేబుళ్లపైనే ఉందని ఆయన గుర్తుచేశారు.

సమన్వయంతోనే బాధితులకు న్యాయం:

పోలీస్ అధికారులు ప్రతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. సాక్షులను సమయానికి కోర్టులో ప్రవేశపెట్టడం, ప్రభుత్వ న్యాయవాదులతో (PP) నిరంతరం సమన్వయం చేసుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. కోర్టులలో కేసుల పురోగతి గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు తెలుసుకుంటూ, కోర్టు కానిస్టేబుళ్లను నిరంతరం గైడ్ చేస్తూ ఉండాలని ఆదేశించారు.

ప్రతిభకు పురస్కారం.. నిర్లక్ష్యానికి శిక్ష:

తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, నిందితులకు శిక్షలు పడేలా నిజాయితీగా కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లను గుర్తించి, వారికి తగిన రివార్డులు మరియు ప్రశంసా పత్రాలతో ప్రోత్సహిస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినా, చట్టాన్ని అతిక్రమించినా లేదా నేరస్థులకు అనుకూలంగా వ్యవహరించినా ఎంతటి వారినైనా సహించేది లేదని, అలాంటి వారిపై శాఖాపరమైన కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో నంద్యాల సబ్ డివిజన్ డిఎస్పీ ఎం. జావళి, కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులు, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు మరియు కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Leave a Reply